టోక్యో జ‌రుగుతున్న‌ ఒలింపిక్స్ లో భారత్ తరఫున తొలి పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్ ను తెర‌కెక్కించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ద‌మ‌వుతున్నాయ‌ట‌.. ఈ మ‌ణిపూస మూవీ విషయమై బాలీవుడ్లో అప్పుడే గుసగుసలు మొద‌ల‌య్యాయి. గ‌తంలో స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరితో చాలా సినిమాలు వ‌చ్చాయి. వాటిలో చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగానే వ‌సూళ్లు సాధించాయి. దీని వల్ల మీరాబాయ్ చాను బయోపిక్కు మరింత క్రేజ్ పెరిగింది అని తెలుస్తోంది.

ఈ బ‌యోపిక్ హక్కుల కోసం ప‌లువురు చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొద‌ల‌యింది. ఈ సిమాలో కీల‌క‌మైన చాను కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్, మీరాబాయ్ వెయిట్ లిఫ్ట‌ర్ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనున్నార‌నే ఊహాగానాలు అప్పుడే సినిమా వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే బ‌యోపిక్ లు తీయ‌డం, అందులో ముఖ్యంగా క్రీడాకారుల బ‌యోపిక్‌లు తీయ‌డంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందువ‌రుస‌లో ఉంటూ వ‌చ్చింది.

టోక్యోలో జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క‌ ఒలింపిక్స్లో భారత దేశానికి తొలి పతకాన్ని మీరాబాయ్ చాను అందించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ 49 కిలోల‌ విభాగంలో వెయిట్ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం ప‌త‌కం సాధించింది. అయితే ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన భారత తొలి వెయిట్ లిఫ్టర్గా మీరాబాయ్ చాను ఘ‌న‌త పొందింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు లిఫ్ట్ చేసింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత మువ్వ‌న్న‌ల జెండ‌ను అంత‌ర్జాతీయంగా ఎగుర‌వేసింది.

 లెజెండ్ వెయిట్ లిఫ్ట‌ర్ క‌ర‌ణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు మీరాబాయ్ చాను పతకం అందించింది. దాదాపు  24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని సృష్టించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకాన్ని శిఖరాగ్రాలకు చేర్చింది ఈ మ‌ణిపూస చాను. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చి చిరస్థాయిగా నిలిచే ఘనతను చాను అందుకుంది. ఒలింపిక్స్లో రజతంతో మెరిసిన మ‌ణిపూస మీరాబాయి చానును ప్రధాని మోదీ ప్ర‌శంసించారు. ఈ మేరకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్వీట్ చేశాడు. ఆమె విజయం భారత ప్రజలందరిలో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు గొప్ప శుభారంభం ల‌భించింద‌ని కొనియాడారు ప్ర‌ధాని మోడి.


మరింత సమాచారం తెలుసుకోండి: