ఆఖరి అంకం ముగిసింది. ఎన్డీఏతో తెలుగుదేశం బంధం తెంచేసుకుంది. బీజేపీతో పొత్తుకి స్వస్తి పలికింది. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న తెలుగుదేశం.. ఇప్పుడు ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చేసింది. అంతేకాక కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం.. దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. దిల్లీ రాజకీయ చర్చలన్నీ ఇప్పుడు ఆంధ్రా చుట్టే తిరుగుతున్నాయి. చంద్రబాబు అడుగులను దేశం ఆసక్తిగా గమనిస్తోంది. అదే సమయంలో నమ్మకమైన మిత్రపక్షాలు దూరం కావడంతో ఎన్డీయేలో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా మిగిలింది. టీడీపీ గుడ్ బైతో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. బీటలు వారిన ఎన్డీయే భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Image result for nda alliance

46 పార్టీల భారీ కూటమి. దేశంలోనే చాలా బలంగా కనిపిస్తున్న ఏకైక పార్టీగా ఉన్న బీజేపీ సారధ్యం. ఇదీ సరిగ్గా నెల రోజుల కిందటి వరకూ ఎన్డీయే పటిష్ట స్థితి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను ఢీకొనడం చాలా కష్టమని 2024 ఎన్నికల మీదే ఆశలు పెట్టుకోవాలని కాంగ్రెస్ సహా.. చాలా పార్టీలు భావించాయి. ఎప్పుడైతే కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పక్షాలు బీజేపీపై దుమ్మెత్తి పోశాయి. బీజేపీ పేరెత్తితేనే ఏపీ ప్రజలు మండిపడే పరిస్థితి నెలకొంది. అది మొదలు బీజేపీకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే ఎందరికో బీజేపీపై అసంతృప్తి ఉన్నా.. ఎలా బయటపడాలో.. బీజేపీను ఎలా ఎదిరించాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి నేపధ్యంలో ఎన్నో పార్టీల, వర్గాల అసంతృప్తులకు నాయకత్వం వహించింది ఆంధ్రప్రదేశ్. 

Image result for upa alliance

అమరావతిలో మొదలైన రాజకీయం ఇప్పుడు హస్తినకు చేరింది. ఆంధ్రుల అసంతృప్తి జ్వాలలకు బలమైన ఎన్డీయే కూటమికే బీటలు వారింది. నమ్మకమైన మిత్రపక్షం తెలుగుదేశం కమలదళంపై విరుచుకుపడుతూ.. ఎన్డీయేకు గుడ్ బై చెప్పేసింది. అక్కడితో ఆగకుండా.. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించింది. తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. దిల్లీ అంతటా ఆంధ్రా రాజకీయాలే చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అన్నా ఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, టీఆరెస్, ఆప్ వంటి పార్టీలు క్షణాల్లో మద్దతు తెలిపాయి. చంద్రబాబుతో కలసి వెళ్లేందుకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ.. జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.

 Image result for upa alliance

తెలుగుదేశం, వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం టెక్నికల్ గా వీగిపోవచ్చు. కానీ.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని భావించిన బీజేపీ విశ్వాసం అమాంతం అధ: పాతాళానికి తొక్కేసినట్లయింది. దేశంలో మున్ముందు చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు టీడీపీ నిర్ణయం బాసటగా నిలిచింది. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని శివసేన తమ పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై భ్రమల నుంచి ప్రజలు బయట పడుతున్నారని, తాము మోసపోయామనే వాస్తవాన్ని వారు గ్రహిస్తున్నారని రాసింది. రాహుల్‌గాంధీ చరిష్మా మున్ముందు పెరగవచ్చునని అభిప్రాయపడింది. 2019 ఎన్నికల తర్వాత ప్రధాని రేసులో శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, మాయావతి ఉంటారని పేర్కొంది. తాజా పరిణామాలతో కంగుతిన్న బీజేపీ.. గడువుకన్నా ముందే సార్వత్రిక ఎన్నికలకు వెళుతుందేమోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: