జగన్మోహన్ రెడ్డికి నిజమైన పరీక్ష ఈరోజే మొదలవ్వబోతోంది. అదికూడా సొంత జిల్లాలోనే. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈరోజు జగన్ శంకుస్ధాపన చేయబోతున్నారు. శంకుస్ధాపనదేముంది  ఎవరైనా చేసేస్తారు. కానీ తర్వాత జరగాల్సిన నిర్మాణాన్ని పూర్తి చేయటమే అసలైన పరీక్ష.  ముచ్చటగా ఈ పరీక్ష మూడోసారి జరుగుతుండటమే విచిత్రంగా ఉంది.

 

స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదటగా శంకుస్ధాపన జరిగింది వైఎస్సార్ హయాంలో.  అప్పట్లో కొంత పని కూడా జరిగింది.  అయితే హఠాత్తుగా వైఎస్ మరణించటం తర్వాత జరిగిన పరిణామాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం మూలపడిపోయింది. తర్వాత అంటే పదేళ్ళకు ఇదే ఫ్యాక్టరీకి చంద్రబాబునాయుడు శంకుస్ధాపన చేశారు.  శంకుస్ధాపన అయితే చేశారు కానీ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సరిగ్గా  ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడిన విషయం అందరికీ తెలిసిందే.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు వేసిన శంకుస్ధాపన రాయి కూడా ఎక్కడుందో తెలీదిపుడు. చివరకు మూడోసారి తాజాగా ఇదే ఫ్యాక్టరీకి జగన్ శంకుస్ధాపన చేయబోతున్నారు.  శంకుస్ధాపన చేయటంతో సరిపెట్టుకోకుండా జగన్ గనుక ఫ్యాక్టరీ నిర్మాణంలో స్పీడు చూపిస్తే పరీక్షలో ఫాస్ అయినట్లే. ఎందుకంటే రూ. 15 వేల కోట్ల అంచనా వ్యయంతో, ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు రెడీ అవుతోంది.

 

ఇంత భారీ సామర్ధ్యం ఉన్న ఫ్యాక్టరీ గనుక రెడీ అయితే రాయలసీమలో ప్రధానంగా కడప జిల్లాకు చాలా ఉపయోగమనే చెప్పాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం దగ్గర ఎటూ డబ్బులేదు కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ఐరన్ ముడిఇనుము సరఫరాకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి)తో ఒప్పందం జరిగింది. ఇక కావాల్సిందల్లా పెట్టుబడులే. ఇందుకు దక్షణి కొరియా లాంటి దేశాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అదికూడా సానుకూలమైతే ఫ్యాక్టరీ పనులు స్పీడందు కోవటం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: