
దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూకకు చావు తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయపై లైంగిక దాడి, హత్య కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్భయపై అతి కిరాతకంగా లైంగికదాడి చేసి.. ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషుల్ని ఫిబ్రవరి 1 ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీకోర్టు డెత్‌వారంట్ జారీచేసింది. ఈ లోపు రెండువారాల వ్యవధిలో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని కోర్టు సూచించింది. దీంతో...ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
నిర్భయ ఘటనలో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(అక్షయ్ ఠాకూర్)(31)పై అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా డెత్ వారంట్ జారీ చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని వాడుకునేందుకు దోషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దోషుల తరఫున క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు, పెయింటింగ్‌లు, డైరీ, స్కెచ్లను తీహార్ జైలు అధికారులు ఇవ్వడం లేదంటూ దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ శనివారం ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక దోషి వినయ్ కుమార్ శర్మకు స్లో పాయిజన్ ఇచ్చారని, మరోదోషి పవన్ సింగ్ తల పగిలిందని ఆరోపించారు. వారికి అందించిన చికిత్స పత్రాలను కూడా ఇవ్వడం లేదన్నారు. అయితే జైలు అధికారులు సంబంధిత పత్రాలను, వినయ్‌కుమార్ వేసిన 10 పెయింటింగ్‌లు, స్కెచ్‌లు, నోట్‌బుక్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో దోషుల పిటిషన్‌ను అదనపు సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ తిరస్కరించారు. వారి తరఫు న్యాయవాది కావాలంటే కోర్టులో ఉన్న ఆ పత్రాలు, నోటుపుస్తకాలు, పెయింటింగ్స్, స్కెచ్‌ల ఫొటోలు తీసుకోవచ్చని చెప్పారు. మరోవైపు ముఖేశ్ కుమార్ తన క్షమాభిక్ష తిరస్కరణపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ముఖేశ్ క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 17న తిరస్కరించారు. ఈ ప్రక్రియపై సమీక్ష కోరినట్టు అతడి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు.
2012 డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలోని ఒక బస్సులో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న 23 ఏండ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా లైంగిక దాడి జరిపి, బస్సు నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం అదేరోజు సఫ్దర్‌జంగ్ దవాఖానలో చేర్చారు. ఈ దారుణ ఘటనపై మరునాడే దేశమంతా భగ్గుమన్నది. నిందితులు బస్సు డ్రైవర్ రాంసింగ్, అతడి సోదరుడు ముఖేశ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను గుర్తించిన పోలీసులు.. 18న అరెస్ట్ చేశారు. 21న నిందితుల్లోని బాల నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆరో నిందితుడు అక్షయ్ ఠాకూర్‌ను బీహార్‌లోని ఔరంగాబాద్‌లో అరెస్ట్ చేశారు. మరోవైపు దవాఖానలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ముందు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చారు. లైంగికదాడి ఘటనలో బాధితురాలు చివరివరకు నిందితులను ప్రతిఘటించిందని తెలుసుకున్న ప్రజలు బాధితురాలికి ‘నిర్భయ’ అనే పేరు పెట్టడంతో ఆ పేరే స్థిరపడింది. చివరకు పోలీసులు అదే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.