ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి... ప్రవర్తన పరంగా నడవడిక పరంగా... అందరికీ ఆదర్శంగా   ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు మాత్రం సగటు మనిషి కంటే అతి దారుణంగా ఆలోచించాడు. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతకీ ఉపాధ్యాయుడు స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఓ వ్యక్తి మొదటి భార్య బతికుండగానే... ఆమెను చనిపోయినట్లుగా నమ్మించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతులను వరుసగా వివాహాలు చేసుకున్నాడు. ఇలా వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ఉపాధ్యాయుడు... నిత్య పెళ్ళికొడుకు గా మారిపోయాడు. ఇక చివరికి ఆ వ్యక్తి రెండో భార్య పోలీస్ స్పందన కార్యక్రమం లో గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 

 కృష్ణాజిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్ వల్లూరు కు చెందిన మహమ్మద్ బాజీ అలియాస్ షేక్ బాజీ అదే గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నాడు.  ఈ క్రమంలోనే అప్పటికే పెళ్ళయిన మహమ్మద్ బాజీ తన మొదటి భార్య చనిపోయింది అని చెప్పి 2011లో.. తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ యువతి తండ్రి ని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి రెండు నెలలు పెళ్లి చేసుకున్న యువతి ని తన ఇంట్లోనే ఉంచాడు. ఇక ఆ తర్వాత వేరు కాపురం పెడదామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకి తీసుకుని అక్కడికి మకాం మార్చాడు. ప్రతి ఆదివారం ఆ యువతి దగ్గరికి వెళ్లి వచ్చేవాడు. 

 

 

 ఇక కొన్ని రోజుల వరకు అలాగే వెళ్లి వచ్చిన ఈ వ్యక్తి... ఆ తర్వాత మొహం చాటేయడంతో బాధితురాలు అనుమానం వచ్చి ఆరా తీశారు. అయితే నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన మరో యువతిని మూడో వివాహం చేసుకుని... ఎవరికి తెలియకుండా రహస్యంగా కాపురం చేస్తున్నాడని తెలియడంతో... ఈ విషయంపై నిలదీయగా.. ఆమెను దుర్భాషలాడి కొట్టాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యి  ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే నెలకొకసారి వెళ్లడం  ప్రారంభించాడు. ఇక పెద్దలు ఆ వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో తన ఆస్తులన్నీ రెండో భార్య పేరున  పెడతానంటూ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ నమ్మించాడు. ఇదిలా ఉంటే తాజాగా 15 ఏళ్ళ మరో మైనర్ బాలికను కూడా వివాహం చేసుకున్నాడు.  వ్యక్తి యొక్క మొదటి భార్య కూడా బతికే ఉంది. అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా  ఈ వ్యక్తి రెండో భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: