చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ఇప్ప‌టికే సుమారు 173దేశాల‌కు వ్యాప్తి చెందింది. రోజురోజుకూ వేగంగా విస్త‌రిస్తోంది. ప్ర‌పంచ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే వేల‌సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు. ఇక జ‌నం దాదాపుగా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు ప్ర‌పంచ దేశాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. నిజానికి.. ప్ర‌పంచం స్తంభించిపోతుంద‌నే చెప్పొచ్చు. అయితే.. ఇప్ప‌టికీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌ని ఖండం ఒక‌టి ఉందంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ..! నిజ‌మే.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే.. ఆ ఖండం ఏమిట‌ని అనుకుంటున్నారా..? అది అంటార్కిటికా..! ఇప్ప‌టివ‌ర‌కైతే.. అక్క‌డ ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేద‌ట‌. ఈ ఖండంలోని వేర్వేరు ప‌రిశోధ‌నా కేంద్రాల్లో ప‌లు దేశాల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు. ఎటువంటి ఇన్ఫెక్ష‌న్లు కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న కేసులు న‌మోదు కాలేదు. అంటార్కిటికా వెళ్లే బ్రిటీష్ ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా 14 రోజుల‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ప‌క‌డ్బందీగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

 అంటార్కిటికా ఖండంలోని వేర్వేరు స్టేష‌న్ల‌లో ఉంటున్న వారికి స‌రుకుల స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు.  ప్ర‌తి ఏడాది సుమారు వెయ్యి మంది ప‌రిశోధ‌కులు వేర్వేరు దేశాల నుంచి అంటార్కిటికాకు వెళ్తుంటారు. అయితే ఆ ఖండానికి స‌మీపంగా ఒక్క ఆస్ప‌త్రి కూడా లేద‌ట‌. అక్క‌డి నుంచి  వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిలీలో హాస్పిట‌ల్ ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ముందు ముందు ఇక్క‌డ కూడా ప‌రిస్థితులు ఎలా ఉంటాయోన‌ని ప్ర‌పంచ‌దేశాలు ఆస‌క్తిగా  ఎదురుచూస్తున్నాయి. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఈ ఖండంలోని స్టేష‌న్ల‌లో ఉంటున్న‌వారి వివ‌రాలు, వారి రాక‌పోక‌ల వివ‌రాలు పూర్తిస్థాయిలో బ‌య‌ట‌కు తెలియ‌దు. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ముందుస్తుగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: