పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సినిమాల్లో తిరుగులేని స్టార్.. కానీ ఆ మాయాజాలం మాత్రం రాజకీయాల్లో ఏమాత్రం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకంగా ఆయన కూడా రెండు చోట్లా ఓడిపోయాడు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో కనిపించడం మానేశాడు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ భయంకరమైన ఓటమి తర్వాత కూడా పవన్ కల్యాణ్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.

 

 

ఇటీవల కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. కరోనా వంటి మహమ్మారి వచ్చి మీదపడుతున్నా ప్రజలను ఏమాత్రం ఆదుకోలేదని ఆగ్రహిస్తున్నారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ అంటూ ఏవేవో చెప్పినా.. 20 లక్షల కోట్లు ఒలకబోస్తున్నానని చెప్పినా జనంలో స్పందనే లేదు. అవి తమ వరకూ వచ్చేది లేదంటున్నారు జనం. వాస్తవానికి కూడా బీజేపీ సర్కారు ప్రజలను ఆదుకునే బాధ్యత రాష్ట్రాల నెత్తిన పడేసి చేతులు దులుపుకుంది.

 

 

చివరకు వలసకూలీల కోసం పెట్టిన రైళ్లకు కూడా చార్జీలు వసూలు చేస్తూ చెడ్డ పేరు మూడగట్టుకుంది. అయితే ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ బీజేపీని మెచ్చుకుంటూ ప్రకటనలు చేయడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు పెట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇంతకీ పవన్ ఏమంటున్నారంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మధ్యతరగతికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయట. కరోనా ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొంటున్న ఆర్థిక ఉపశమన చర్యలు మధ్యతరగతికి భరోసా ఇచ్చేలా ఉన్నాయట.

 

 

సొంత ఇంటి కోసం రుణాలు తీసుకొనేవారికి వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర అదనంగా ఇవ్వడం వల్ల గృహ రుణాలు తీసుకున్న వేతనాల మీద ఆధారపడ్డ ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకొనేవారికి ఉపశమనం కలుగుతుందట. గతంలో మ్యూచువల్ ఫండ్స్ లో చిన్నపాటి మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిరువ్యాపారులు నష్టపోకుండా ఉంటారట. పవన్ పెడుతున్న ఈ పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: