ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చాక, రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీ, కాస్త టీడీపీ అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అలాగే కన్నా, చంద్రబాబుకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళినవారు సైతం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా కన్నాని తప్పించి, సోము వీర్రాజుని పెట్టాక పరిస్తితి పూర్తిగా మారిపోయింది. సోము అధ్యక్షుడు అయ్యాక చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపించింది. అలాగే జగన్‌కు కాస్త అనుకూలంగా నడుస్తారనే వాదన వినిపించింది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయంలో సోము, జగన్‌ని మాత్రమే విమర్శించకుండా, గత చంద్రబాబు ప్రభుత్వం విషయాలని కూడా తీసి విమర్శించారు.
దీంతో సోము పక్కా జగన్ మనిషి అని టీడీపీ నేతలు విమర్శించారు. ఇదే సమయంలో బీజేపీలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని కూడా సోము కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. అలాగే టీడీపీకి అనుకూలంగా మాట్లాడేవారు పెద్దగా బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే సోము పలువురు బీజేపీ నేతలనీ సస్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇటీవల అమరావతికి మద్ధతుగా మాట్లాడారని ఓ నేతని సస్పెండ్ చేసిన సోము వీర్రాజు...తాజాగా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ని సస్పెండ్ చేశారు. ఈయన సుజనాచౌదరి సన్నిహితుడు. పార్టీ అజెండాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లంకా దినకర్‌కు గతంలో షోకాజ్ నోటీసులను ఇచ్చారు. అయితే దానికి సమాధానం ఇవ్వకుండా తిరిగి చర్చల్లో పాల్గొనడం, పార్టీ లైన్‌ను దాటుతుండటంతో సోము వీర్రాజు లంకా దినకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైగా దినకర్ టీడీపీకి అనుకూలంగా నడుస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే దినకర్ సస్పెన్షన్ ద్వారా బీజేపీలో టీడీపీకి అనుకూలంగా ఉండేవారికి చోటు లేదని సోము వీర్రాజు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి