అన్ లాక్ నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. అయితే స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా అటాక్ అవుతున్న నేపథ్యంలో స్కూళ్లు కొనసాగించాలా, లేదా ఆన్ లైన్ క్లాస్ లతో సరిపెట్టాలా అనే సందిగ్ధం నెలకొంది. దీంతో అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడిన సందర్భంలో కూడా స్కూళ్ల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం మరీ మొండిగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ఇంకా పాఠశాలల్లో కొనసాగిస్తోందని మండిపడ్డారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 55వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వైసీపీ.. పేద విద్యార్థులకు స్మార్ట్ ‌ఫోన్లు, ట్యాబ్ ‌లు ఉచితంగా ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కరోనా తీవ్రత తగ్గకపోయినా.. బడులు తెరిచి వందల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందడానికి జగన్‌ ప్రభుత్వమే కారణం అంటూ మండిపడ్డారు. పాఠశాలల్లో తరగతులను తక్షణమే నిలిపేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం లాగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఈ ఆలోచనలో లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్కూళ్లు తెరవడం వల్ల కరోనా సోకలేదని, అది గతంలోనే వచ్చి ఉంటుందని, స్కూళ్లు తెరిచే రోజు అది బయటపడిందని మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే వివరణ ఇచ్చారు. కేవలం స్కూళ్లు తెరవడం వల్లే ఎక్కడా కొత్త కేసులు నమోదు కావడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు వినే అవకాశం ఉన్నవారికి హాజరు మినహాయింపు ఇస్తున్నామని కూడా చెప్పారు మంత్రి. ఇప్పటికీ స్కూళ్లు తెరవకపోతే పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు తెరిచామని చెప్పారు. టీడీపీ మాత్రం తక్షణమే స్కూళ్లను మూసివేసి.. ప్రభుత్వమే విద్యార్థులకు ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: