తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు అధికార టీఆర్ఎస్ పార్టీకి అడ్డే లేదని అనుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీల పరిస్తితి దారుణంగా తయారవ్వడంతో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించారు. కానీ అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ పుంజుకుంది. మిగిలిన ప్రతిపక్షాలు కనుమరుగయ్యే స్థితికి చేరుకోవడంతో, కమలం జోరు పెరిగింది.

అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో కారు పార్టీకే షాక్ ఇచ్చింది. అక్కడ టీఆర్ఎస్‌పై బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. ఇక అక్కడ నుంచి చూస్తే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కమలం దూకుడు కనబర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో కారు పార్టీని దాదాపు ఓడించినంత పని చేసింది. అయితే అధికార గులాబీ పార్టీకి గ్రేటర్‌లో మేజిక్ ఫిగర్ రాకపోయినా, తమకున్న ఎక్స్అఫిషియో మెంబర్స్‌, ఎం‌ఐ‌ఎం సహకారంతో గ్రేటర్ పీఠం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

అయితే గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకున్నా, కమలం మాత్రం దూకుడుగానే ఉంది. ఇంకా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది. గులాబీ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలకు వరుస పెట్టి కాషాయ జెండా కప్పేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై గులాబీ పార్టీపై దూకుడుగా ఉన్నారు. ఇక కమలం దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కారు స్పీడ్ పెంచింది. కేంద్రంలో బీజేపీని దెబ్బకొట్టేలా కేసీఆర్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

అందుకే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెళ్లారు. అలాగే వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న లక్షలాది మంది రైతుల ఉద్యమానికి మద్ధతు తెలిపారు. అలాగే రైతుల ఉద్యమానికి మద్ధతుగా భారత్ బంద్ చేపట్టారు.
అనూహ్యంగా కేటీఆర్ రోడ్డుపైకి వచ్చి రైతులకు సపోర్ట్ ఇచ్చారు. అక్కడే కమలం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్యతిరేకమని, వ్యవసాయ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం వాటిల్లిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇలా తమపై ఎటాక్ చేస్తున్న కమలంపై కారు పార్టీ రివర్స్ ఎటాక్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: