ఏపీలో బలపడటానికి పవన్ కల్యాణ్ ఏమన్నా కష్టపడుతున్నారా? రాష్ట్రంలో జనసేనకు 175 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారా? అసలు పవన్ నెక్స్ట్ ఏ సీటులో పోటీ చేస్తారు? అనే ప్రశ్నలకు జనసేన కార్యకర్తల నుంచే పెద్దగా సమాధానం రాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీలో జనసేన బలం పుంజుకోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్, టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పిలతో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయారు.


పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ ఎన్నికల్లో జనసేన 7 శాతం ఓట్లు వరకు తెచ్చుకుంది. సరే ఇప్పుడు 7 శాతం మాత్రమే తెచ్చుకున్న, నెక్స్ట్ మాత్రం జనసేన సత్తా చాటుతుందని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలై రెండేళ్ళు అయిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో జనసేన ఇంకా వీక్ అయినట్లు కనిపిస్తుంది.


సేఫ్ సైడ్‌గా బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్న పవన్‌ బలం పెరగలేదనే చెప్పొచ్చు. పైగా పవన్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఏదో అప్పుడప్పుడు ఏపీకి వచ్చి రాజకీయాలు చేసి మళ్ళీ హైదరాబాద్‌కు వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటున్నారు. సినిమాలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదుగానీ, పార్టీని మాత్రం గాలికొదిలేస్తే ఇబ్బందే ఉంటుందని కొందరు జనసైనికులు భావిస్తున్నారు.


ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకులు లేరు. అసలు ఎన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు ఉన్నారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. పైగా పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే విషయం కూడా తెలియడం లేదు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఆ రెండుచోట్ల బరిలో ఉండాలి అనుకుంటే, ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో పర్యటించి, పార్టీని బలోపేతం చేయాలి. పోనీ వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటే, ముందుగానే ఫిక్స్ చేసుకుని, అక్కడ ప్రజలకు దగ్గరవ్వాలి. కానీ పవన్ కల్యాణ్ ఏది చేయడం లేదు. దీని బట్టి చూస్తే మళ్ళీ ఎన్నికల్లో జనసేనకు ఒకటి, రెండు సీట్లే వచ్చే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: