కరోనా వ్యాక్సీన్‌ సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందివ్వాలి.. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాల లక్ష్యం ఇదే. కానీ.. అవసరమైనంత స్థాయిలో టీకా డోసుల ఉత్పత్తి జరగడం లేదు. అందులోనూ చాలా టీకాలు రెండు డోసులు వేసుకోవాల్సిందే. అందులోనూ మొదటి టీకా డోసుకూ రెండో టీకా డోసుకూ ఉన్న టైమ్ గ్యాప్‌ ఒక్కో వ్యాక్సీన్‌కు ఒక్కో రకంగా ఉంటుంది. మరి.. టీకా డోసు టైమ్ వచ్చేశాక.. అదే డోసు టీకా లభ్యం కాకపోవచ్చు. ఈ సమస్య కూడా ఉంది.


అందుకే రెండు డోసులు వేరు వేరు కంపెనీలవి తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కొన్నాళ్ల క్రితం వచ్చింది. దీనిపై అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కొన్ని సంస్థలు ఇలా మిక్స్‌డ్‌ డోసులు మంచివే అన్నారు. ఇంకొందరు కాదంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఈ కలగలపు పద్ధతిని పాటిస్తున్నారు కూడా. ఇటీవలే జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వేర్వేరు టీకా డోసులను తీసుకున్నారు. అయితే.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం.. వేర్వేరు కంపెనీలు తయారీ చేసిన కరోనా టీకాలను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం ప్రమాదకరమని  తేల్చి చెప్పింది.


అసలు  ఇప్పటివరకూ కొవిడ్‌ టీకాల కాంబినేషన్‌పై సరైన సమాచారమే అందుబాటులో లేదని.. అలాంటప్పుడు ఇలా వేర్వేరు డోసులు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తోంది. అసలు ఈ ధోరణే మంచిది కాదంటోంది. ఇది చాలాప్రమాదంతో కూడిన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అసలు ఎప్పుడు, ఎవరు ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలనేది కంపెనీలు ఎలా నిర్ణయిస్తాయన్నారు.


ఇలా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడాన్ని సైన్స్ పరిభాషలో హెటిరో లోగస్‌ ఇమ్యూనైజేషన్‌ అంటారు. రెండు విభిన్న టీకాలు వాడిన సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా స్పందిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వద్దని చెబుతోంది. ఏంటో ఈ కరోనా విషయంలో ఎవరు ఏం చెబుతున్నారో.. ఏది నిజమో అర్థంకాకుండా ఉంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: