ఇప్పటి వరకూ ఆనందయ్య మందు పేరుతో జనాలకు సుపరిచితం అయిన ఆయుర్వేద మందుకి మరో పేరు రాబోతోంది. అవును, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే ఈ మందుని కొత్త పేరుతో మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది.

కరోనా చికిత్సకోసం ఆనందయ్య తయారు చేసిన మందుల్లో కొన్నిరకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, కంట్లో వేసుకునే ఐ డ్రాప్స్ కి మాత్రం అనుమతి రాలేదు. దీనిపై ఆనందయ్య హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కంట్లో వేసే చుక్కల మందు అత్యంత ప్రభావవంతమైందని ఆయన చెబుతున్నారు. చుక్కల మందు అనుమతికోసం జరుగుతున్న కేసు విచారణలో భాగంగా.. ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వినీకుమార్ ఆయుష్ శాఖ అనుమతి వ్యవహారాన్ని కోర్టుకి వివరించారు.

ఆనందయ్య తయారు చేసిన మందుని కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆనందయ్య తరపు న్యాయవాది హైకోర్టుకి నివేదించారు. అయితే ఆయుష్ శాఖ తరపున పంపిణీ చేసే మందుకి పేరు ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్ పెంచేందుకు కంట్లో వేసే చుక్కల ముందు అనుమతి విషయంలో చర్చలు జరుగుతున్నాయని, దానిలో కొంత పురోగతి ఉందని కోర్టుకి తెలిపారు. ఆనందయ్య తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

ఆయుష్ ఆధ్వర్యంలో పంపిణీ ఉంటుందా..?
ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతిచ్చినా.. దాని తయారీ, పంపిణీ విషయంలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆనందయ్య మందుని పంపిణీ చేస్తున్నారు కానీ, అధికారికంగా ఈ కార్యక్రమం జరగలేదు. ఆయుష్ శాఖ అనుమతి ఇచ్చి, కరోనా నివారణకు ఈ మందుని పంపిణీ చేయడం మొదలు పెడితే మాత్రం ఆనందయ్య న్యాయపోరాటం ఫలించినట్టే. అయితే అప్పుడు ఆనందయ్య మందు అనే పేరుతోనే ఆయుష్ శాఖ ఈ ఆయుర్వేద మందుని మార్కెట్ లోకి తెస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కొత్త పేరు ఇంకా ఖరారు కాలేదని అంటున్నారు ఆనందయ్య తరపు న్యాయవాది.

మరింత సమాచారం తెలుసుకోండి: