గతంతో పోలిస్తే గత కొంత కాలంగా జీవన విధానం చాలా కాస్ట్లీ గా మారిపోయింది. ఒక సగటు సామాన్యుడు ఈ సమాజంలో బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలు, మారిన జీవన విధానమే ఇందుకు కారణం. సామాన్యుడి సంపాదన అంతగా పెరగడం లేదు.. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ - డీజల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతూ సామాన్యుడి నెత్తిపై గుదిబండలా మారుతున్నాయి. ఇటీవల కాలంలో వంట నూనెలు ధరలు కూడా ఏ స్థాయిలో పెరిగాయి అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. కాగా దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా వంట నూనెలకు సంబందించిన ఒక వార్త అందరికి సంతోషాన్ని ఇస్తోంది.

ముఖ్యంగా సామాన్యులకు ఇదో పెద్ద శుభవార్త. ఇంతకీ వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. తద్వారా పలు దేశాలపై ఈ ప్రభావం భారీగా పడింది. వంటల నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారత్ లోనూ వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. కాగా తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా దేశం. అయితే సోమవారం నుండి ఈ నిషేధం ఎత్తివేత అమలులోకి రానుంది అని ఇండోనేషియా దేశాధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు.

ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అయితే తాజాగా నిషేధం ఎత్తేయడంతో భారత్‌ వంటి దేశాల్లో వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం కనబడుతోంది. నూనె ఉత్పత్తి, ఎగుమతులలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఇండోనేషియా నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంతో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడని.. ఈ స్థానిక వ్యాపారాలు తగ్గినా పెరిగిన ధరలకే అమ్మకాలు చేస్తారేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: