ఏపీతోపాటు, తెలంగాణలో కూడా ధాన్యం దిగుబడులు అధికంగా ఉన్నాయి. కానీ ఎగుమతుల్లో మాత్రం ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంటే, తెలంగాణ పదో స్థానంతో సరిపెట్టుకుంది. ఎందుకీ వ్యత్యాసం..? దిగుబడులు బాగా ఉన్నా కూడా తెలంగాణ ఎగుమతుల్లో ఎందుకు వెనకపడింది..?

విదేశాలకు సాధారణ బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. తెలంగాణలో ధాన్యం దిగుబడులు బాగానే ఉన్నా కూడా నౌకాశ్రయాలు లేకపోవడంతో ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. ఏపీలో నౌకాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో వరి ధాన్యం దిగుబడులను కూడా ఏపీ వ్యాపారులు కొని, ఇక్కడినుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సహజంగానే ఏపీనుంచి ఎగుమతులు పెరిగాయి. దేశంలోనే ఏపీ నెంబర్ -1 స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా సాగరతీరం, నౌకాశ్రయాలున్న రాష్ట్రాలు..  ఏపీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు బియ్యం ఎగుమతుల్లో తొలి అయిదుస్థానాల్లో నిలవడం విశేషం. ఆ రాష్ట్రాల తర్వాత బీహార్‌ ఆరోస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌ ఏడో స్థానం, హరియాణా ఎనిమిది, ఒడిశా తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. తెలంగాణ 10వస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి హరియాణా, ఒడిశా రాష్ట్రాలు ధాన్యం దిగుబడిలో తెలంగాణ కంటే చాలా వెనక ఉన్నాయి. అక్కడ ధాన్యం ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా ఎగుమతుల విషయంలో మాత్రం ఆ రెండు రాష్ట్రాలు తెలంగాణను వెనక్కు నెట్టడం విశేషం.

గణాంకాలు ఇలా..
గతేడాది భారత్ నుంచి కోటీ 72 లక్షల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అయింది. ఇందులో 40 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాలనుంచే ఎగుమతి అయ్యాయి. ఏపీ నుంచి 68.57 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. రూ.17,225.13 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ నుంచి 27,055 టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. రూ.370.52 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: