మంకీపాక్స్ తో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందనే భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. కేరళ, ఢిల్లీ తర్వాత మంకీ పాక్స్ కేసు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఓ అనుమానితుడు ఉన్నాడు. అతను ఈనెల 6న కువైట్ నుంచి భారత్ కి తిరిగొచ్చాడు. కొన్నిరోజులు అతని ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత జ్వరం, చర్మంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడినుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అతడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలిస్తోంది.

తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలున్నట్టు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అతని రక్త నమూనాలను హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. అక్కడినుంచి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించబోతున్నారు. మంకీపాక్స్ నిర్థారణ అయితే తెలంగాణలో ఇదే తొలికేసు అవుతుంది. ఇప్పటికే కేరళలో రెండు కేసులు బయటపడ్డాయి. తాజాగా ఢిల్లీలో కూడా మరో కేసు నిర్థారణ అయింది. ఇది తెలంగాణలో తొలికేసు అవుతుంది, అలాగే భారత్ లో ఇది నాలుగో కేసు అవుతుంది.

భయం వద్దు..
మరోవైపు మంకీపాక్స్ తో భయం వద్దని, అది ప్రాణాంతకమైన వ్యాధి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బాధితుడు కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కువైట్ నుంచి వచ్చిన వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురు కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని గుర్తించారు అధికారులు. ఆ ఆరుగురికీ ప్రాథమిక పరీక్షలు చేశారు. వారిలో ఎవరికీ జ్వరం కానీ, శరీరంపై దద్దుర్లు కానీ లేవని నిర్థారించుకున్నారు. అయితే ఆ ఆరుగురినీ మందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచి అబర్వేషన్లో పెట్టారు. పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపిన శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేయాలని భావిస్తున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: