కేసీఆర్ సపోర్ట్ తో ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని అన్నారు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు అని జోస్యం చెప్పారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే తండ్రీ కూతుర్లు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవచ్చని దానికి మధ్యవర్తుల అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ గెలిచినప్పుడు అందరికీ దేవుడు అయ్యాడని ఒక్క ఓటమి ఎదురవగానే అదే కేసీఆర్ దయ్యం అయ్యాడని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ను వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. దానికి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తారని అన్నారు. కవిత కూడా వైఎస్ షర్మిల మాదిరిగా అన్న జగన్ కు దూరం అయిన తరవాత  పాదయాత్ర చేసిన విధంగా కవిత కూడా పాదయాత్ర చేయబోతుందని అన్నారు. అది బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత ఇటీవల కేసీఆర్ కు రాసిన లేఖ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖలో పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

బీఆర్ఎస్ లో కేసీఆర్ దేవుడు అని కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో ఆమె భేటీ అయ్యారు. ఈ క్రమంలో కవిత అసంతృప్తిగా ఉన్నారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె బీఆర్ఎస్ ను వీడుతారు అని కొత్త పార్టీ పెడతారని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు కవిత జాగృతి నేతలతో సమావేశం అవడంతో జాగృతిని బలోపేతం చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీలో ఆమె కొనసాగుతారని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: