ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. భాషపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన, హిందీ భాషను రాజకీయంగా చూడకూడదని, అది దేశవ్యాప్తంగా సాధారణ సంభాషణ భాషగా ఎదగాలని కోరారు. హిందీ భాష వ్యాప్తిపై ఆయన చూపిన ప్రోత్సాహం, దక్షిణాది రాజకీయ నాయకులో కొన్ని అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ తాను చిన్ననాటి నుంచి హిందీని రెండో భాషగా చదివిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో భాషపై ఎటువంటి విభేదాలు లేకపోయినా, ఇప్పుడు ఎందుకు భిన్న ధోరణులు పెరిగిపోతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇది చూడటానికి సాధారణ వ్యాఖ్యలా కనిపించినా, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం రాజకీయంగా విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ఆయన "హిందీపై ద్వేషం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి పుట్టుకొస్తోంది" అని చెప్పిన మాటలు, నేరుగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి.


కేటీఆర్ గతంలో స్పష్టంగా "హిందీ జాతీయ భాష కాదు" అని వ్యాఖ్యానించడమే కాకుండా, హిందీని దేశవ్యాప్తంగా బలవంతంగా మోపడం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. ఇది ప్రత్యేకంగా దక్షిణాదిలో భాషా వైవిధ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కూడుకున్నది. దీంతో ఈ అంశం తెలంగాణ-ఆంధ్రా రాజకీయ వేదికల మధ్య కొత్త రేఖలు గీయగలదని భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పరోక్షంగా అయినా కేటీఆర్ వైఖరిపై చురకలే అంటిస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో బలంగా ఉంది. ఆయన మోదీపై ద్వేషం హిందీపైకి మళ్ళుతోందని చెప్పడం, తాను హిందీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించడం రాజకీయంగా విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం పలు రాజకీయ సందేశాలను అందిస్తోంది.



ఈ వ్యాఖ్యలు దక్షిణాదిలో భాషాపై చర్చను మరింత వేడెక్కించే అవకాశం ఉంది. హిందీ ప్రాచుర్యానికి మద్దతుగా పవన్ తీసుకుంటున్న వైఖరి ఒకపక్క, స్థానిక భాషల పరిరక్షణ కోసం కేటీఆర్ వంటి నేతలు తీసుకుంటున్న భిన్న దృక్పథం మరోపక్క ఉన్నప్పటికీ, ఈ వివాదం చివరికి జాతీయ స్థాయిలో భాషల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. భాషా రాజకీయం మరోసారి వెలుగులోకి రావడం ద్వారా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు, భావోద్వేగాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తం మీద, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక సాధారణ భాషా ప్రేమిగా చేసినవిగా కనిపించినప్పటికీ, దాని వెనుక రాజకీయ తాత్పర్యం లేకపోలేదన్నది స్పష్టమవుతోంది. ఆయన వ్యాఖ్యలు కేటీఆర్‌ను ఉద్దేశించినవేనా ? లేదా ఓ సాధారణ సమీకరణమా ? అన్నది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేము. కానీ ఈ మాటల ప్రభావం మాత్రం దక్షిణాదిలో హిందీ భవిష్యత్తు చర్చకు దారితీయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: