- ( అమ‌రావతి - ఇండియా హెరాల్డ్ )

తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయం టీడీపీకి, కూట‌మి ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడిపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా అంచనాలే పెట్టుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఆయన బలమైన గళం పార్టీకి మేలు చేస్తుందని భావించారు. కొలికపూడి తన బలమైన గళాన్ని పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా, తన పంతం, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారణం, తొలిసారి ఎమ్మెల్యే అయినా తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆయన ఆశించడం. ఆయనకున్న బలమైన గళం, ఉన్నత విద్య వంటివి కలిసి వస్తాయని, చంద్రబాబు టీంలో తనకు స్థానం దక్కుతుందని ఆయన భావించారట‌. కానీ, ఆ అవకాశం దక్కలేదు. ఇదే అసలు సమస్యకు దారితీసింది. దీంతో ఆయన 'రివర్స్ గేర్స‌లో రాజ‌కీయం చేయ‌డం ప్రారంభించారు.


వివాదాస్పద నాయకుడిగా కొలికపూడి :
మంత్రి పదవి దక్కకపోవడం కొలికపూడి హవాను నియోజకవర్గంలో తగ్గించడమే కాకుండా, ఆయన్ను వివాదాస్పద నాయకుడిగా నిలబెట్టింది. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడటం ఆయనకు పెద్ద మైన‌స్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఒకటి, రెండు సార్లు పార్టీలో పంచాయతీలు కూడా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకానొక దశలో ఆయన్ను పక్కన పెట్టారు. మైలవరంలో పర్యటించినప్పుడు కొలికపూడిని కనీసం పలకరించలేదు. దీంతో ఆయన మారతారని అందరూ అనుకున్నారు.


మారినట్టే కనిపించి.. మళ్లీ పాత పంథా
కొలిక‌పూడిలో నిజంగానే మార్పు కనిపించింది. సుమారు నెల రోజుల పాటు మౌనంగా ఉన్నారు. కానీ, ఇంతలోనే మళ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో, కొలికపూడి వైసీపీకి చేరువ అవుతున్నట్టుగా సంకేతాలు పంపించారు. ఇది ఒక రకంగా ఆయన వేసిన ప్లాన్‌గా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంతలోనే వైసీపీ కీలక నాయకుడు, పార్టీలో నంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన భేటీ అయిన వీడియోలు బయటకు వచ్చాయి.


చంద్రబాబు వ్యూహంపై ఉత్కంఠ
కొలికపూడి నేరుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోతారా లేదా అనేది పక్కన పెడితే, ఆయన వ్యూహాత్మకంగా టీడీపీకి కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం. అంటే, తన హవాకు, తన దూకుడుకు అడ్డుకట్ట వేసినా, బెదిరించినా, తనకు ప్రత్యామ్నాయం ఉందని సంకేతాలు ఇవ్వడం ద్వారా కొలికపూడి వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మరి దీనిని చంద్రబాబు నాయుడు ఎలా చూస్తారన్నది తేలాల్సి ఉంది. కొలికపూడి చర్యలు టీడీపీకి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: