
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు సీనియర్ నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనను వదిలేస్తున్నారు. "పాలిటిక్స్ బాలేవు.. వద్దులే" అన్న మాటనే పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతానికి చెందిన ఒక కీలక మంత్రి, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన, తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై మీడియా ప్రశ్నించగా "వద్దులే అబ్బా.. పాలిటిక్స్ బాలేవు" అని సమాధానం ఇచ్చారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ వంటి నేతలు కూడా తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు. కానీ కాలక్రమేణా వారు కూడా వెనక్కి తగ్గారు. నారాయణకు ఇద్దరు కుమార్తెలే ఉన్నప్పటికీ, ఆయన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం మొదట ఉండేది. కానీ, ఆయన ఆమెను కూడా ఆ ఆలోచన నుంచి వెనక్కి లాగి, నియోజకవర్గ స్థాయి పనులకు మాత్రమే పరిమితం చేశారు. గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై మొదట ఉత్సాహం చూపించినా, తరువాత వ్యాపారంలోనే కొనసాగించాలని నిర్ణయించారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా తన ఇద్దరు పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కనేవారు. కానీ ఇటీవల ఆయన ఆ ప్లాన్లను పక్కన పెట్టి, ఫ్లెక్సీల్లో కూడా పిల్లల ఫోటోలు వేయొద్దని అనుమతి ఇచ్చారు. ఇది ఆయన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. వైసీపీ లో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తోంది. ఒకప్పుడు వారసత్వానికి పెద్ద పీట వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఆయన కూడా కారణం అదే ..! ఈ మార్పు వెనుక కారణం ఏంటి అంటే, ప్రస్తుతం రాజకీయాల్లో ఒత్తిడి, వ్యతిరేకత, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం, అలాగే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎక్కువైపోవడమే. "పాలిటిక్స్ బాలేవు" అని చెప్పే సీనియర్ నేతల మాటలో, వారే గతంలో రాజకీయాలను ఈ స్థాయికి తీసుకువచ్చారన్న వారసుల విమర్శ కూడా దాగి ఉంది.