ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలి ఏడాది కలిసొచ్చింది. పదవులు, గౌరవాలు, ప్రోటోకాల్ - అన్నీ సజావుగా పంచి, సీఎం చంద్రబాబు అన్ని మిత్రపక్షాల మనసు గెలుచుకున్నారు. కానీ, రెండో ఏడాదికి అడుగుపెడుతున్న తరుణంలో, కూటమి లోపల కొన్ని చిట్టి చిట్టి లుకలుకలు మసాలా పుకార్లుగా మారుతున్నాయి. వీటిలో రెండు విషయాలు మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొదటిది - జనసేనకు చెందిన ఓ మంత్రి గోడు. తన శాఖను స్వచ్ఛంగా మార్చి, అవినీతి రహితంగా నడపాలని కసిగా ఉన్నా, టీడీపీ వైపు నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని ఆయన నేరుగా పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారట. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకుంటే, వెంటనే ‘ఫోన్ కాల్’ రాజకీయం మొదలవుతోందట.
 

“వాళ్లను వదిలేయండి” అనే ఆదేశాలు వస్తున్నాయట. దీంతో, మంత్రి చేతులు కట్టేయబడి, విపక్షాల విమర్శలకు గురవుతున్నారు. “మన శాఖ స్వేచ్ఛగా పనిచేయాలి” అనే పవన్ స్టాండ్‌ ఇప్పుడు కూటమిలో గుసగుసలకు కారణమైంది. రెండోది - కేంద్రం పంపిన రూ. 1132 కోట్ల రూపాయల నిధుల కథ. ఇవి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ పంచాయతీల అభివృద్ధి కోసం పంపబడ్డాయి. దానికి 10% రాష్ట్ర వాటా జోడించి వెంటనే విడుదల చేయాల్సి ఉంది. కానీ, రెండు నెలలు గడిచిపోయినా ఆర్థిక శాఖ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదట. పంచాయతీల్లో మళ్లీ వైసీపీ హయాంలోలాగే పనులు ఆగిపోవడంతో, గ్రామస్థాయిలో అసంతృప్తి మొదలైంది. పవన్ కళ్యాణ్ పలు మార్లు కోరినా ఫలితం లేకపోవడం, ఆయనకు నిరాశ కలిగించింది.



ఈ రెండు అంశాలే ఇప్పుడు పవన్-చంద్రబాబు మధ్య చిన్నపాటి ‘దూరం’కి కారణమని పరిశీలకులు అంటున్నారు. బయటికి ఏం కనబడకపోయినా, లోపల చల్లని గాలి కాస్త వేడి అవుతోందని రాజకీయ వర్గాల్లో టాక్. కూటమి ప్రభుత్వంలో ఇవి పెద్ద విభేదాలుగా మారకముందే, అంతర్గత చర్చలతో పరిష్కరించుకునే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. కానీ, ఈ సంఘటనలు ఒక విషయం మాత్రం స్పష్టంచేశాయి - కూటమి పాలనలో ‘స్వేచ్ఛ’ కోరుకునే జనసేన, ‘సమన్వయం’ కోరుకునే టీడీపీ మధ్య ఎప్పుడైనా చిచ్చు రగులే అవకాశముంది. ఈ రాజకీయ సీన్ చూస్తుంటే, మామూలు కూటమి కాదు, ఇది ఒక ‘సైలెంట్ వార్‌’ లాంటి పంథాలో సాగుతోందని అనిపిస్తోంది. బయటకు క‌లిసిమెలిసి స్మైల్స్, లోపల మైక్ లేకుండా హీట్ డిబేట్స్ - ఇదే ఏపీ కూటమి ప్రస్తుత పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: