వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 12 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు. ఇందులో చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలోకి విలీనం చేయగా, కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చారు. ఈ పునర్విభజన పూర్తిగా అస్తవ్యస్తంగా జరిగిందని, స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ప్రజాభీష్టం మేరకు జిల్లాల పునర్విభజన చేస్తామంటూ టిడిపి అప్పట్లోనే హామీ ఇచ్చింది.


అందులో భాగంగానే పశ్చిమ ప్రకాశంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు 2023 ఏప్రిల్ 20న తన జన్మదినం సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీపై అక్కడి ప్రజలు విపరీతమైన నమ్మకం ఉంచి, ఎంతోకాలంగా కొత్త జిల్లా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన క‌మిటీ జిల్లాలపై అధ్యయనం చేస్తుండగా, గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశం మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు అధికారులకు వినతిపత్రం అందజేశారు. 2026లో జరగనున్న జనగణనలోగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే ప్రతిపాదన ఖరారు చేయబడుతోంది. ఇలా జరిగితే, చంద్రబాబు ఇక్కడి వారికి ఇచ్చిన హామీ అమలైనట్లే అవుతుంది.


అదే సమయంలో ఒంగోలు, కొండేపి, సంతనూతులపాడు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలతో మిగిలిన ప్రకాశం జిల్లా కొనసాగనుంది. ఈ విభజనలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసే దిశగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం సుదూరంగా ఉండకూడదని, ప్రజల అవసరాలు సులభంగా తీర్చుకునే విధంగా విభజన చేపట్టాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో అక్కడి ప్రజలకు చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరుతుంది. స్థానిక పరిపాలన సులభమవుతుందని, అభివృద్ధి దిశగా కొత్త అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో టిడిపి ఇచ్చిన హామీ కూడా నెరవేరినట్లవుతుంది. మొత్తానికి, కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర పరిపాలనా దృష్ట్యా అవసరం మాత్రమే కాకుండా రాజకీయపరంగా కూడా కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: