
ప్రస్తుతం బిహార్‌లో ఓటర్ల జాబితా రివిజన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఓటు హక్కు కోల్పోయిన వారికి ఊరట కలిగించాయి. తమ పేర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు ఆందోళన చెందుతున్న లక్షలాది మంది ఇప్పుడు ఆధార్‌తోపాటు ఇతర ధృవపత్రాలను సమర్పించి తిరిగి తమ ఓటు హక్కును పొందవచ్చు. అయితే ఈ వివాదంపై రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. లక్షలాది ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపణలు చేస్తూనే, వారికి సహాయం చేయడంలో మాత్రం రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా బూత్ స్థాయి ఏజెంట్ల బాధ్యతను ప్రశ్నిస్తూ.. “మీరు మీ పనిని సరిగా చేయకపోతే ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరించాలి?” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పార్టీల ఏజెంట్లు అభ్యంతరాలు సమర్పించకపోవడం, కేవలం ఎంపీలు – ఎంఎల్ఏలు మాత్రమే ముందుకు రావడం పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ ఓటర్లను రక్షించుకోవడం, వారి హక్కులను కాపాడుకోవడం రాజకీయ పార్టీల మౌలిక బాధ్యత అని కోర్టు గట్టిగా గుర్తు చేసింది. ఈ తాజా ఆదేశాలతో బిహార్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సవరణ మరింత క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా సాగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తొలగించబడిన ఓటర్లకు ఇప్పుడు కొత్తగా అవకాశం లభించనుంది. ఆధార్ సహా అవసరమైన పత్రాలు సమర్పించి తిరిగి జాబితాలో తమ పేరు చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓటర్ల జాబితా తొలగింపుతో రాజకీయంగా రచ్చ రేగినా.. సుప్రీంకోర్టు జోక్యంతో ప్రజల ఓటు హక్కు మరింత సురక్షితమవుతుందనే నమ్మకం కలుగుతోంది. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆదేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి.