తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి పెరగనుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న సర్పంచ్ ఎన్నికలకు ఇప్పుడు ముహూర్తం ఖరారు కానుంది. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి, నెలాఖరులోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆగస్టు 29న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామస్థాయిలోని సర్పంచ్ నుంచి మండల, జిల్లా పరిషత్ స్థాయిల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది.


ముఖ్యంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలనే ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ అమలు అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ సమీకరణలు పూర్తిగా మారిపోవడం ఖాయం. మరోవైపు, హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికలను వాయిదా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయనే వార్త బయటకు రావడంతో ఆశావాహులు ఇప్పటికే ఫీల్డ్‌లోకి దిగిపోయారు. ప్రతి గ్రామంలోనూ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.

 

ఎవరికి టికెట్ వస్తుంది? ఎవరు రేసులో ఉంటారు? అనే చర్చలు మొదలయ్యాయి. బీసీ రిజర్వేషన్ అమలవుతుందనే బజ్ వలన మరిన్ని కొత్త ఫేసెస్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాదని, ఇవే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు టెస్ట్ కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ కు బలమైన పట్టు ఉంటేనే రేవంత్ సర్కార్ పైన ఉన్న నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలా రాణిస్తాయో కూడా పెద్ద ప్రశ్నే. మొత్తానికి తెలంగాణలో సెప్టెంబర్‌లో సర్పంచ్ ఎన్నికల పండుగ ఖాయమైంది. ఆగస్టు 29న కేబినెట్ మీటింగ్‌లో క్లారిటీ రాగానే, గ్రామాలు గులాబీ – కాషాయం – హ‌స్తం కాంబినేషన్లతో వేడెక్కిపోవడం ఖాయం..!

మరింత సమాచారం తెలుసుకోండి: