తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా బస్సు చార్జీల పెంపు నిర్ణయంపై కవిత సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై వరుసగా భారాలు మోపుతోందని కవిత మండిపడ్డారు. ఇటీవల బస్ పాస్ ధరలను భారీగా పెంచి చిరుద్యోగులపై పెను భారం వేశారని, ఇప్పుడు ఏకంగా బస్సు చార్జీలను అమాంతం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా సామాన్య ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని ఆమె విమర్శించారు.

'గ్రీన్ జర్నీ' పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అధికారంలో తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను భారంగా మార్చడం ద్వారా ప్రభుత్వం సామాన్యుల పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తోందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలపై పగబట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ నిర్ణయాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

బస్సు చార్జీల పెంపుపై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆ పార్టీ నుంచి దూరమైన కవిత వ్యాఖ్యలు మరింత పదును పెంచాయి

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించి, ఇప్పుడు ఇతర చార్జీలు పెంచడం ద్వారా ప్రజల నుంచి పరోక్షంగా డబ్బును వసూలు చేస్తోందని సామాన్య ప్రజల నుంచి  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ప్రజల రవాణా భారంపై కవిత చేసిన ఈ విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సామాన్య ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఈ నిర్ణయంపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: