బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో రాజకీయ ముఖచిత్రం చిత్ర విచిత్రంగా మారింది. ప్రధాన కూటములతో పాటు, కొత్త పార్టీలు, కుటుంబ కలహాలు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయనే చర్చ మొదలైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ చేసిన ప్రకటన ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద షాక్ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యనిషేధాన్ని ఎత్తివేసి, మద్యం అవుట్‌లెట్లను తెరుస్తామని హామీ ఇచ్చింది. సాధారణంగా ఏ పార్టీ అయినా నిషేధాన్ని కొనసాగిస్తామని చెబుతుండగా, దీనికి విరుద్ధంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఇచ్చిన ఈ హామీ ప్రజలను ఏ మేరకు ఆకర్షిస్తుందనేది ఆసక్తికరం.


ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలోని అంతర్గత వివాదాలు రాజకీయ రచ్చగా మారాయి. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంతంగా పార్టీని స్థాపించడం ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజ్ ప్రతాప్‌కు యాదవ్ సామాజిక వర్గంలో గణనీయమైన మద్దతు ఉంది. సుమారు 32 మంది అభ్యర్థులతో బరిలోకి దిగుతానని ప్రకటించిన తేజ్ ప్రతాప్, తాను కింగ్‌మేకర్ అవుతానని చెప్పడం ఆర్జేడీకి ఓటు బ్యాంకుగా ఉన్న యాదవ్ సామాజిక వర్గంలో చీలిక తీసుకువచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అనూహ్యంగా బీహార్ ఎన్నికల బరిలోకి దిగింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మాయావతి ప్రకటించడం, ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి తీవ్ర సంకటంగా మారింది. కీలకమైన దళిత ఓటు బ్యాంకు చీలిక తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా 243 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించినప్పటికీ, 110 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఎక్కువమంది కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులే కావడం విశేషం. బీహార్ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఈ చిన్న చిన్న పరిణామాలు, ఓట్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసి, చివరి నిమిషంలో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: