ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ 'ఉచిత పథకాలు' ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. "ఏపీలో యువత ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగడం లేదు. 25 సంవత్సరాల భవితను కోరుకుంటున్నారు" అంటూ ఆయన చేసిన పోస్టు, పాలక విధానాలపై పరోక్ష విమర్శగా ప్రతిపక్షాలకు పదునైన ఆయుధాన్ని ఇచ్చింది. ఈ వ్యాఖ్యలకు నేపథ్యం ఉంది. 2018, అక్టోబరు 12న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగ యువతతో మాట్లాడారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను, ప్రస్తుత మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


దానిని రీపోస్ట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు యువత తమ నిరుద్యోగాన్ని ప్రస్తావించి, ఉపాధి కల్పించాలని కోరారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్లో పరోక్షంగా గుర్తు చేశారు. అంటే, ఐదేళ్ల తర్వాత అధికారం పంచుకున్నా, యువత ఆకాంక్ష మాత్రం ఉచితాలు కాదని, ఉపాధి, సుదీర్ఘ భవిష్యత్తు అని పవన్ కళ్యాణ్ గట్టిగా నొక్కి చెప్పారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సంక్షేమ పథకాల విషయంలో పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి. ఈ వ్యాఖ్యలు నేరుగా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే విధంగా ఉండటంతో, ప్రతిపక్ష నాయకులు విమర్శలకు పదును పెడుతున్నారు. సంక్షేమం ముసుగులో యువత ఆశయాలను విస్మరిస్తున్నారనే భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.



 ఇటీవలే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం "ఉచితాలు అనుచితాలు" అంటూ, ఉపాధి మార్గాలు చూపించకుండా ఉచితాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉదయం సంక్షేమం కింద డబ్బులు ఇచ్చి, సాయంత్రం మద్యం రూపంలో లాగేస్తున్నారని రెండు తెలుగు రాష్ట్రాలనూ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో, అధికార కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో 'ఉచితాల'పై వ్యతిరేకత చూపడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నమా? లేక సంక్షేమం ముసుగులో ఉపాధిని విస్మరిస్తున్నారనే ఆవేదనా? అనేది రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో జనసేన వైఖరి ఎలా ఉండబోతుందనే దానిపై ఈ వ్యాఖ్యలు ఓ స్పష్టతనిచ్చాయని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో 'ఉచితాల'పై కొత్త చర్చకు తెరలేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: