మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో జనసేన అన్నా దాని అధినేత పవన్ కల్యాణ్ అన్నా పెద్ద లెక్కలేదు. ఎందుకంటే జనసేనను ఏర్పాటు చేసిన దగ్గర నుండి పవన్ సొంతంగా రాజకీయాలు చేయటానికి చేసిన ప్రయత్నమే లేదు. ఎంతసేపు చంద్రబాబునాయుడు జేబులో మనిషిగా చెలామణి అవుదామా లేకపోతే బిజెపితో పొత్తులు పెట్టుకుని బాధ్యతంతా వాళ్ళపై మోపేద్దామా అన్న ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాడు. అందుకనే జగన్ కానీ వైసిపి నేతలు కానీ జనసేనను, పవన్ ను పెద్దగా పట్టించుకోవటం లేదు.

 

రాజకీయ పార్టీగా జనసేన ఏర్పడిన దగ్గర నుండి కూడా  జనాల్లో గుర్తింపు తెచ్చుకోవటానికి పవన్ చేసిన ప్రయత్నాలంటూ పెద్దగా లేవనే చెప్పాలి.  కారణం ఏమిటంటే ఏ విషయంలో కూడా స్ధిరత్వం లేకపోవటం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేయకపోవటమే. 2019 ముందు ఒకసారి జగన్ పై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలు చేశాడు. వెంటనే చంద్రబాబునాయుడు, లోకేష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశాడు. వెంటనే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశాడు.

 

ఇటువంటి పరస్పర విరుద్ధమైన భావాలు వ్యక్తం చేయటంతోనే పవన్ బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని జనాల్లోకి బాగా వెళిపోయింది. తెలంగాణాలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటి చేయనని చేసిన ప్రకటన కూడా విచిత్రమే. ఒకసారి కేసీయార్ ను విమర్శించి మరోసారి ఆకాశానికి ఎత్తేశాడు. తెలంగాణా ఏర్పాటుపై ఒకసారి విమర్శలు చేసి మరోసారి బ్రహ్మాండమన్నాడు.  అంటే ఇతర రాజకీయ పార్టీల విషయంలో స్పష్టమైన వైఖరి లేదనటానికి ఇవన్నీ ఉదాహరణలుగా నిలిచాయి.

 

తాను ప్రతిపక్షంలో ఉంటూ మరో ప్రతిపక్షమైన వైసిపిని టార్గెట్ చేసుకున్న నేత పవన్ కల్యాణ్ మాత్రమే దేశం మొత్తం మీద. ఎక్కడైనా ప్రతిపక్షాలకు అధికారపక్షం టార్గెట్ గా ఉండటం చాలా సహజం. కానీ పవన్ మాత్రం చంద్రబాబును వదలిపెట్టేసి జగన్ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. దాంతోనే పవన్ అంటే చంద్రబాబు జేబులో మనిషే అనే ముద్రపడిపోయింది. జనాలు కూడా ప్రభుత్వంపైన అధికారపార్టీపైన పోరాటం చేసే వాళ్ళనే ఆధరిస్తారు. ఇంతచిన్న విషయాన్ని కూడా పవన్ తెలుసుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం పెట్టుకున్నా వెంటనే పవన్ కూడా అప్పటికప్పుడు పోటిగా మరో కార్యక్రమం పెట్టుకున్న విషయాలు చాలా ఉన్నాయి. దాంతో జనాలే పవన్ ను లైటుగా తీసుకున్నారు. ఇక జనాలే పవన్ పట్టించుకోనపుడు జగన్ మాత్రం ఎలా గుర్తిస్తాడు. అందుకనే జనసేనను ఓ పార్టీగాను పవన్ ను రాజకీయ నేతగానే జగన్ గుర్తించటానికి ఇష్టపడలేదు.

 

జగన్ గుర్తించకపోయినా పవన్ కు వచ్చిన నష్టం లేదని వాదించే వాళ్ళున్నారు. కానీ పవన్ తెలుసుకోవాల్సిందేమంటే తాను గెలుచుకోవాల్సింది జనాల అభిమానాన్ని. ఎందుకంటే చంద్రబాబుతో ఎటువంటి సంబంధాలున్నా జనాలు ఆధరించకపోతే ఉపయోగం లేదన్న విషయాన్ని పవన్ ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: