శబరిమల.. కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్పస్వామిని ద‌ర్శించుకోవ‌డానికి ప్రతియేటా భక్తకోటి సందర్శిస్తుంటారు. కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని పిలుస్తారు. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఇక శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. అలాగే అనేక నియమాలను పాటిస్తూ దీక్షాకాలాన్ని పూర్తిచేసుకుని శబరిమల స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు. 

 

అడవులు, కొండలు దాటుకుంటూ స్వామి దర్శనం చేసుకుని సంతృప్తి చెందుతుంటారు. ఇక్కడ పద్ధెనిమిది మెట్లు అధిరోహించి స్వామిని దర్శించుకోవలసి ఉంటుంది. దీక్ష తీసుకున్నవారు మాత్రమే ఈ మెట్లను అధిరోహించే అర్హత కలిగివుంటారు. అలాగే ఈ మెట్లను ఎక్కి, స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు అవుతుంది. ఇక ఈ పద్ధెనిమిది మెట్లకి ఎనలేని ప్రాధాన్యం ఉంది.అయితే ఇక్క‌డ పద్ధెనిమిది మెట్లే ఎందుకున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్న సహజమైనదే. హరిహరసుతుడైన అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. 

 

మహిషిని వధించిన తరువాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం- దేవతా రూపాలు దాల్చి పద్ధెనిమిది మెట్లుగా అమరాయనీ, అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారనీ అంటుంటారు. పట్టబంధాసనంలో ఆయన కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చారనీ, యోగసమాధిలోకి వెళ్ళి, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారనీ పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని ‘సన్నిధానం’ అని వ్యవహరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: