ప్రపంచ నంబర్‌ వన్ టెన్నిస్‌ ‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్ కు కరోనా కాటుకు గుర‌య్యాడు. ఆయ‌న‌తో పాటు అత‌ని భార్య కూడా క‌రోనా బారిన  ప‌డింది. రెండు మూడు రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న జకోవిచ్‌తో పాటు అతడి భార్య జెలీనా మంగ‌ళ‌వారం ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ ఫ‌లితాల్లో ఇద్ద‌రికి పాజిటివ్ వ‌చ్చింది. అయితే వారి పిల్ల‌ల‌కు మాత్రం నెగ‌టివ్ రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. జకోవిచ్ కు పాజిటివ్ వచ్చినా, ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఇదే విష‌యాన్ని జ‌కోవిచ్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు తెలిపారు. ’ నేను బెల్‌గ్రేడ్‌కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కోవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాను. 


రిపోర్టులో నాకు, నా భార్యకు పాజిటివ్‌ రాగా, పిల్లలకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం క్వారెంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటాం.’ అంటూ తెలిపారు. ఇటీవల జకోవిచ్ సహా పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఓ ఎగ్జిబిషన్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీలో ఆడిన గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కోరిచ్ కు ఇంతకుముందే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ టోర్నీలో ఆడిన ప్రతి ఆటగాడికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆర్గనైజర్లు నిర్ణయించారు. ఈ క్రమంలో బెల్ గ్రేడ్ చేరుకున్న జకోవిచ్ కు, అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, జకోవిచ్ కు, భార్య జెలెనాకు పాజిటివ్ అని తేలింది.


ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ ప్రభావం మధ్య సెర్బియా మరియు క్రొయేషియాలో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం మరియు ఇతర దేశాల నుండి ఆటగాళ్లను తీసుకురావడంపై జకోవిచ్ ఫై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఆటగాళ్లు భౌతిక దూరం కూడా పాటించలేదని కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మ‌రోవైపు కరోనా వైరస్ క్రీడారంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా.. ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: