నేటి నుండి ప్రారంభం అయిన మహిళల వన్ డే వరల్డ్ కప్ కు శుభారంభం దక్కింది. ఈ రోజు బే ఓవల్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు తొలి పోరులో తడబడ్డారు. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ ఖచ్చితంగా కివీస్ అని చెప్పాలి. ఎందుకంటే అన్ని విభాగాలలో వెస్ట్ ఇండీస్ కంటే బలంగా ఉంది, అంతే కాకుండా సొంత గడ్డపై ఆడుతుండడం కూడా కలిసొచ్చే విషయం. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఎవ్వరు సరైన ప్రదర్శన చేస్తారో వారిదే విజయం. ఈ రోజు కూడా సరిగ్గా అదే జరిగింది. ముందుగా టాస్ గెలిచిన కివీస్ విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆ తర్వాత విండీస్ మొదటి నుండి వికెట్లు కాపాడుకుంటూ వచ్చింది కానీ స్కోర్ చాలా తక్కువగా ఉంది.

అయితే చివరకు వచ్చే సరికి హేలీ మాథ్యూస్ కెరీర్ లో మూడవ సెంచరీ (119) సాధించడంతో విండీస్ 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాస్తవానికి బౌలింగ్ లో బలంగా ఉండే ఏ జట్టుకైనా ఈ స్కోర్ ను కాపాడుకుని విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ బౌలింగ్ లోనూ బలహీనంగా ఉండే విండీస్ కు ఇక ఈ మ్యాచ్ గెలవడం కష్టమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాచ్ జరిగే కొద్దీ గెలుపు ఇటు జట్ల మధ్యన దోబూచులాడుతూ వచ్చింది. ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ సోపీ డివైన్ (109) సెంచరీతో గెలుపు ముంగిట నిలిపింది. అయితే దురదృష్టం కివీస్ ను వెంటాడింది. ఆఖరి ఓవర్ లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజులో మార్టిన్ ఉంది.

అయితే చివరి ఓవర్ ను చాలా తెలివిగా కెప్టెన్ టేలర్ అప్పటి వరకు బౌలింగ్ చేసిన ఎవ్వరినీ కాదని డాటిన్ చేతికి బంతిని అందించింది. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా బౌలింగ్ కు వచ్చిన ఈమె మొదటి బంతికి సింగిల్ ఇచ్చింది, తర్వాత బంతికి ఫామ్ లో ఉన్న మార్టిన్ ను చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దానితో సమీకరణం కాస్తా 4 బంతుల్లో 5 పరుగులకు వచ్చింది. మూడవ బంతికి మళ్లీ రో సింగిల్ తీసింది. నాలుగవ బంతికి  జెస్ కేర్ ను ఔట్ చేసింది. ఒక మిగిలింది రెండు బంతులు కావాల్సింది 4 పరుగులు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించిన జోనస్ రన్ ఔట్ అయ్యి మ్యాచ్ ను వెస్ట్ ఇండీస్ కు అప్పగించింది. ఆఖరి ఓవర్లో అద్బుతం చేసి డాటిన్  తన జట్టుకు వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: