ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ (PBKS), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లో హై డ్రామా నడుస్తోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం డీఆర్‌ఎస్ కాల్ విషయంలో ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందంటే.. పంజాబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ వేసిన బంతికి ట్రావిస్ హెడ్ అవుటయ్యాడని గట్టిగా నమ్మాడు. బంతి బ్యాట్‌కు తగిలి కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చేతుల్లోకి వెళ్ళిందని మాక్సీ గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చేశాడు.

దాంతో మాక్స్‌వెల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డీఆర్‌ఎస్ రివ్యూ కోరాడు. కెప్టెన్ శ్రేయాస్‌ను కనీసం అడగకుండానే మాక్సీ రివ్యూకి వెళ్లడం అయ్యర్‌కు అస్సలు నచ్చలేదు. "ఏంటిది? నన్ను అడగకుండానే నువ్వెలా రివ్యూకి వెళ్తావ్?" అన్నట్లుగా అయ్యర్ సీరియస్‌గా చూస్తూ, తన వైపు చేతులు చూపిస్తూ సైగలు చేశాడు. ఆడియో సరిగ్గా వినపడకపోయినా, అయ్యర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఫుల్లుగా చిర్రెత్తుకొచ్చినట్లు కనిపించింది.

చివరికి మాక్స్‌వెల్ పట్టుబట్టడంతో అయ్యర్ రివ్యూకి ఒప్పుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ కూడా ట్రావిస్ హెడ్ నాటౌట్ అని చెప్పడంతో పంజాబ్‌కు రివ్యూ వృథా అయింది. ఈ డీఆర్‌ఎస్ డ్రామా మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మాత్రం దుమ్మురేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్, హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 245 పరుగులు చేసింది.

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌తో చెలరేగాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 82 పరుగులు చేశాడు. తెలివైన షాట్లతో పాటు భారీ హిట్టింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌కు శ్రేయాస్ వెన్నెముకలా నిలిచాడు.

ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ అసలు సిసలు వీరబాదుడు బాదాడు. కేవలం 11 బంతుల్లోనే 34 పరుగులు పిండుకున్నాడు. అందులోనూ ఒకే ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సులు దంచికొట్టాడు. ఈ సీజన్‌లో ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న స్టోయినిస్, ఈ ఇన్నింగ్స్‌తో తన విమర్శకుల నోళ్లు మూయించాడు.

పంజాబ్ బ్యాటింగ్ విధ్వంసంలో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ షమీ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. స్టోయినిస్ ధాటికి షమీ బౌలింగ్ బెంబేలెత్తిపోయింది. చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

అంతకుముందు పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా షమీ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొత్తానికి డీఆర్‌ఎస్ డ్రామా పక్కనపెడితే, పంజాబ్ బ్యాటింగ్ మాత్రం ఈ మ్యాచ్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: