ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్పది.తల్లి ప్రేమకు మించిన విలువైనది ఈ భూమి మీద ఏమి లేదనే చెప్పాలి.తల్లి తన బిడ్డలను ఎంతో కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. సమస్యల నుంచి వారిని బయటపడేసేందుకు, నిత్యం సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తుంది.ఈ నేపథ్యంలో అమ్మ ప్రేమ, ఆమె సృజనాత్మకతకు సంబంధించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ తల్లి తాను సైకిల్ పై వెళుతూ తన బిడ్డను కూడా వెనకాల జాగ్రత్తగా తీసుకుని వెళుతూ కనిపించింది. పైగా ఆ బిడ్డ కూర్చునే సీటు ను కూడా కుర్చీ తో గట్టిగా సెట్ చేసింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.సమాజంలో ఎంతో మంది తల్లులు పనులకు వెళ్లేటప్పుడు తమ పిల్లలను భుజాన మోసుకెళుతూ ఉంటారు. 


ఇక వలస కూలీలైతే రోజుల తరబడి కిలోమీటర్ల పాటు పిల్లలను మోసుకెళ్తూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన ప్రేమకు కాస్త సృజనాత్మకతను జోడించి తయారుచేసిన ఈ కుర్చీ సైకిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుందని నిరూపించే ఈ 9 సెకన్ల వీడియోకు ఇప్పటి వరకు 1.4 మిలియన్ల వ్యూస్‌ రావడం విశేషం. అలాగే 5,000 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. కాగా పిల్లలపై ఉన్న ప్రేమకు తన సృజనాత్మకతను జోడించిన మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ ప్రపంచంలోని చాలా ఆవిష్కరణలు అమ్మ ప్రేమతోనే మొదలైనవేనంటూ స్పందిస్తున్నారు. అమ్మ ప్రేమకు క్రియేటివిటీ తోడైతే ఇలాంటి అద్భుతాలే ఆవిష్కృతమవుతాయంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: