ఏదైనా హోటల్‌కి సరదాగా కుటుంబ సభ్యులతో తినడానికి వెళ్తే బిల్ ఎంత అవుతుంది అనేది అందరికీ ఒక ఐడియా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఊహించిన బిల్‌తో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు అంటూ భారీగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తూ, మళ్లీ కస్టమర్లపై సర్వీస్ ఛార్జీలు ఎందుకు వేస్తున్నారు? ఇది న్యాయమా? అంటూ ప్రశ్నించింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి అంటూ ఫిక్స్ చేశాయి. మనం తినే భోజనం కంటే కూడా సర్వీస్ ఛార్జీల బిల్లు ఎక్కువగా వస్తోంది. ఈ కారణంగానే గతేడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సర్వీస్ ఛార్జీలపై ప్రత్యేక తీర్పు ఇచ్చింది.


కానీ దీనిని సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఎందుకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయో ప్రశ్నిస్తూ, తమ వద్దకు వచ్చే కస్టమర్లపై మూడు రకాలుగా చార్జీలు వసూలు చేస్తున్నారని కోర్టు తప్పు పట్టింది. ఆహార పదార్థాలు విక్రయించడం, వాటిని సర్వ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడం, "ఆహ్లాదకర వాతావరణం" పేరుతో మరింత డబ్బులు తీసుకోవడం ..ఇవన్నీ తప్పు అని పేర్కొంది.



ఇప్పటికే ఆహ్లాదకర వాతావరణం పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు, మళ్లీ సర్వీస్ పేరుతో వడ్డించడానికి ఛార్జీలు తీసుకోవడం, అదనంగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం సరైంది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదాహరణకు: 20 రూపాయల వాటర్ బాటిల్‌ని రెస్టారెంట్లలో ₹100కి అమ్ముతున్నారు. మరి కస్టమర్ మళ్లీ ఎందుకు సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి? 20 రూపాయల బాటిల్ ధరను 100గా మార్చి అమ్ముతూ, అదనంగా ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం? అంటూ కోర్టు మండిపడింది.



సర్వీస్ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించాలనేలా బిల్లులో కలపడం వారి హక్కుల ఉల్లంఘన అవుతుందని హైకోర్టు పేర్కొంది. సర్వీస్ ఛార్జీలు చెల్లించాలా ..? వద్దా..?  అనేది పూర్తిగా కస్టమర్ వ్యక్తిగత నిర్ణయం. ఇష్టమున్నవారు చెల్లిస్తారు, ఇష్టం లేనివారు చెల్లించరు అంతే. కస్టమర్లపై ఈ విధంగా అదనపు చార్జీలు విధించే రెస్టారెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ సంస్థకు హైకోర్టు సూచించింది. కొంతమంది హోటల్ సిబ్బంది సర్వీస్ చేశాక కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ అడిగి తీసుకోవడం, 500 రూపాయల బిల్‌కే 100 రూపాయలు అదనంగా వసూలు చేయడం పట్ల సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై హైకోర్టు “ఇకపైన రెస్టారెంట్లు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరించింది. ఇకనైనా పెద్ద హోటళ్లలో ఈ సర్వీస్ ఛార్జీలు తీసేస్తారా ..? లేదా..? వేచి చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: