
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నెయ్యిలో ఉండే పోషక విలువలు శరీరానికి సరైన పద్ధతిలో అందించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.నెయ్యికి ఆయుర్వేద శాస్త్రంలో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. అందులో ముఖ్యంగా దేశీ నెయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆవు నెయ్యి తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి నేరుగా అందుతాయి. అయితే ఇప్పుడు నెయ్యి ముఖంతోపాటు జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని వైద్య,ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
నెయ్యిని జుట్టుకు పట్టించడం వల్ల నిర్జీవమైన జుట్టు తొలగిపోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా మిక్స్ చేయాలి. దీనిని గోరువెచ్చగా వేడి చేసి కుదుళ్ళకు పట్టించి, బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా ఉండటమే కాకుండా జుట్టు ప్రకాశవంతంగా నిగనిగలాడుతుంది. అంతేకాకుండా జుట్టు నిర్జీవమైనప్పుడు దీనిని గోరువెచ్చగా వేడి చేసి, కుదుళ్ల నుంచి జుట్టు కొనవరకు పట్టించాలి. ఒక గంట సేపు అలాగే వదిలేసి తలంటు పోసుకుంటే జుట్టు ఆరోగ్యవంతంగా మారి పోవడం లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
అంతేకాకుండా నెయ్యిని ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు.చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఎందుకోసం మనము ఎన్నో రకాలైన క్రీమ్స్,కాస్మెటిక్స్ ను వాడుతుంటాము. ఇప్పుడు వాటన్నిటినీ పక్కన పెట్టి ఒకసారి నెయ్యిని కూడా వాడి చూడండి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని, అందులో కొంచెం బాదం నూనె కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మృదుత్వం తో పాటు నిగారింపు కూడా వస్తుంది.
పెదవులు బాగా పగిలిపోయి ఇబ్బంది పడుతున్నారా? రోజూ వాడే వ్యాస్లీన్ కన్నా నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నను కొద్దిగా అరచేతిలోకి తీసుకొని, ముని వేళ్ళతో బాగా పెదవులపై అప్లై చేయాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేయడం వల్ల పెదవులు మృదుత్వాన్ని పెంపొందించుకోవడం తోపాటు చూడచక్కగా తయారవుతాయి.
మీరు మేకప్ వేసుకొని దానిని తీసేటప్పుడు మేకప్ రిమూవర్ లాంటి హానికరమైన కెమికల్స్ కలిగిన క్రీమ్స్ ను ఉపయోగించి చర్మాన్ని కాంతి విహీనంగా చేసుకుంటుంటారు. అలాంటి వారి కోసమే కాటన్ ప్యాడ్ పై కొంచెం నెయ్యి వేసి దానితో మేకప్ ను రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న పూర్తి మేకప్ తొలగిపోయి, మేకప్ వల్ల చర్మం ఇబ్బందికి గురయి ఉంటుంది. ఇలాంటప్పుడు నెయ్యిని ఉపయోగించి మేకప్ ని తీసేయడం వల్ల చర్మం తిరిగి కాంతిని పుంజుకుంటుంది.
కాళ్ళ పగుళ్ళకు కూడా నెయ్యి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిమ్మ చెక్క పైన నెయ్యిని వేసుకొని వృత్తాకారంలో కాళ్ళ పగుళ్లు పైన మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల నెలలోనే మార్పును గమనించగలరు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నెయ్యిని మీరు కూడా ఒకసారి ఉపయోగించి, దాని ప్రయోజనాలను ఇతరులకు పంచండి.