జాతిని ఉద్దేశించి మంగ‌ళ‌వారం రాత్రి భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన ప్ర‌సంగంపై హీరో, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ స్పందించారు. ప్రధాని చెప్పిన రెండు అంశాలతో తాము కూడా ఏకీభవిస్తామని తెలిపారు. ఈ  సంక్షోభంలో పేదలే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వావలంబనతోనే దేశ‌ భవిష్యత్ ముడిపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారని, వాటిని తాము కూడా అంగీకరిస్తున్నామని కమల్ సోష‌ల్‌మీడియాలో వెల్ల‌డించారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని కూడా స్వాగతిస్తున్నామని, అయితే, అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి అంటూ ఆయ‌న‌ పేర్కొన్నారు.

 

అయితే.. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని క‌మ‌ల్‌హాసన్ విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. వ‌ల‌స కూలీలను ప‌ట్టించుకోవ‌డంలేదంటూ క‌మ‌ల్ విమ‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా.. కరోనా వ‌ల‌న దెబ్బ‌తిన్న‌ భారత ఆర్థికవ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్ర‌ధాని మోడీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: