
ఇప్పటికే ఆప్ దిల్లీ, పంజాబ్‌లలో అధికారం దక్కించుకుంది. గుజరాత్‌లోనూ 5 ఎమ్మెల్యే సీట్లు పొందింది. మరో వైపు కేసీఆర్ కూడా ఇప్పుడు తన పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. కర్ణాటకలో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఇదంతా నిజం కాదని వాదిస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌ను చంపేందుకు మోదీకి కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ సహకరిస్తున్నారని వాదిస్తున్నారు. వీరంతా రహస్యంగా మోదికి అనుకూలంగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే వీరంతా గుజరాత్ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు.
టీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌గా మారడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం ఉత్తరాదిన కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు ఉపయోగపడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.దక్షిణాదిన బీఆర్ఎస్ ఈ పని చేయబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఆవిర్భావానికి మధ్య సంబంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహంగా బీఆర్‌ఎస్‌ను రేవంత్ రెడ్డి అభివర్ణించారు. సజ్జల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని.. బీఆర్‌ఎస్, ఆప్, ఎంఐఎం.. ఈ మూడు బీజేపీ ఏజెంట్‌లని రేవంత్ రెడ్డి ఆరోపించారు.