
చేసిన పాపాలు ఒకపట్టాన వదలవని పెద్దలు చెప్పే మాట అందరు వినే ఉంటారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఈ విషయం బాగానే అనుభవంలోకి వచ్చుంటుంది. అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం అనవసరంగా వేలుపెట్టి దొరికిపోయిన ‘ఓటుకునోటు’ కేసు చంద్రబాబును వదలకుండా వెంటాడుతునే ఉంది. ఈరోజు ఇదే కేసు విషయమై సుప్రింకోర్టులో సుదీర్ఘ వాదన జరిగింది. ఓటుకునోటు కేసుకు అసలు మూలకారకుడైన చంద్రబాబును ఇంతవరకు ముద్దాయిగా విచారణ జరపనే లేదని పిటీషనర్ తరపు లాయర్ ప్రశాంత్ భూషణ్ గట్టిగా బల్లగుద్ది మరీ వాదించారు. దాంతో కేసు విచారణను విచారిస్తున్న ఏఎస్ బాబ్డే వచ్చే జూలై మాసానికి వాయిదా వేశారు. అయితే వేసవి సెలవుల తర్వాత కేసును విచారిస్తానని చెప్పటం కాదని కచ్చితమైన విచారణ తేదీని చెప్పాల్సిందేనని ప్రశాంత్ పట్టుబట్టారు. ఆ విషయాన్ని లిఖితపూర్వక ఆదేశాల్లో చెబుతామని కేసును వాయిదా వేసేశారు.
న్యాయవ్యవస్ధలో తనకున్న పట్టు కారణంగానే ఓటుకునోటు కేసు విచారణకు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారని కాదుకానీ జరుగుతున్న విషయాలు చూస్తే అందరికీ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఎలాగంటే ఓటుకునోటు కేసును విచారించింది తెలంగాణా ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్నారని ఆరోపణలకు గైరన రేవంతరెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్ సింహ తదితరులు అరెస్టయి రిమాండ్ కు వెళ్ళి తర్వాత బెయిల్ పై బయట తిరుగుతున్నారు. కానీ అసలు కేసుకు మూల కారకుడైన చంద్రబాబు మీద మాత్రం కనీసం కేసు కూడా నమోదుకాలేదు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీటులో 37 చోట్ల చంద్రబాబు ప్రస్తావించింది. అయితే మరి ముద్దాయిగా ఎందుకు చంద్రబాబును చెప్పలేదు ? ఎందుకు విచారణకు నోటీసులు ఇవ్వలేదు ? అన్నది సస్సెన్సుగా ఉండిపోయింది.
తాజగా సుప్రింకోర్టులో జరిగిన విచారణలో ఇదే అంశాన్ని ప్రశాంత్ లేవనెత్తారు. ఏసీబీ చార్జిషీటులో 37 చోట్ల చంద్రబాబు ప్రస్తావన ఉన్నపుడు ఒక్కసారి కూడా ఎందుకు విచారణకు తీసుకోలేదని లాయర్ సూటిగా ప్రశ్నించారు. 37 సార్లు చార్జిషీట్లో పేరున్నపుడు ఎక్కడా ముద్దాయిగా చంద్రబాబును ఎందుకు విచారణకు నోటీసు ఇవ్వలేదో చెప్పాలంటూ గట్టిగా పట్టుబట్టారు. దాంతో కేసు విచారణను ఏకంగా ఏడుమాసాలు వాయిదా వేసేయటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపేమో నేరచరితులైన ప్రజాప్రతినిధులు చట్టసభల్లోకి ప్రవేశించకూడదని ఇదే సుప్రింకోర్టు చెప్పింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు మీదున్న కేసు విచారణను ఏకంగా ఏడుమాసాల తర్వాత విచారించనున్నట్లు చెప్పింది. మొత్తానికి కేసు ఎప్పుడు విచారణకు వచ్చినా ఓటుకునోటు చంద్రబాబు వెంటాడుతున్నట్లే ఉంది.