ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అసలు ఆ పార్టీ ఏపీలో ఉందా? లేదా? అనే సందేహం ఇప్పటికీ చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. సాకే శైలజానాథ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఎక్కడా ఆ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలుకానీ, నిరసన కార్యక్రమాలుకానీ చేపట్టడంలేదు. ప్రత్యేకహోదాపై ఉన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోలేకపోతోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, పల్లంరాజు, టి.సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డిలాంటివారు ప్రకటనలకే పరిమితమయ్యారు. వ్యాపారాలున్నవారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇతరత్రా పనులున్నవారు వారి వారి రంగాల్లో నిమగ్నమయ్యారు. తమను ఒక స్థాయికి చేర్చిన పార్టీపై మాత్రం శీతకన్ను వేశారు.
ఎన్నో విఫల అంశాలు.. ఉపయోగించుకోలేకపోతున్న వైనం
ఏపీలో ప్రతిపక్షపాత్ర పోషించడానికి అవసరమైన అంశాలు చాలా ఉన్నాయి. అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా ఆ పార్టీ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడం, ఇసుక కొరత వేధిస్తుండటం, ఉద్యోగాల కల్పనలో విఫలమవడం, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, రాష్ట్రంలో రివర్స్ టెండర్లు, ప్రత్యేకహోదా అంశం, మూడు రాజధానుల అంశం, విశాఖలో తరుచుగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, రాష్ట్రాన్ని వేధిస్తోన్న కొవిడ్ టీకాల కొరత, ముఖ్యమంత్రి తాడేపల్లి ఇంటి గడప దాటకపోవడంలాంటి ఎన్నో అంశాలను సద్వినియోగపరుచుకొని పోరాటాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ దక్కేది. కానీ ముందే కాడి పారేయడంవల్ల ప్రజలు కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీని మరిచిపోయారు.
కాంగ్రెస్ ఓటుబ్యాంకు వైసీపీవైపు?
మొదటినుంచి ఆ పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లింలు, దళితులు వైసీపీవైపు మొగ్గుచూపడంతోపాటు కార్యకర్తల వ్యవస్థ బలహీనపడటంలాంటి అంశాలన్నీ ఏపీలో ఆ పార్టీని బలహీనపరిచేలా చేశాయి. ఓటమిపాలైన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై పెట్టిన దృష్టి ఏపీపై పెట్టలేదు. రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రజల నుంచి ఆదరణ దక్కడం కష్టమనే అంచనాతో వారు కూడా అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రాన్ని విభజించి ఎనిమిది సంవత్సరాలువుతున్నా ఆ పార్టీ పరిస్థితి మత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో ఉంది. పార్టీ బలోపేతం కోసం అధిష్టానం కూడా ఎటువంటి దృష్టి పెట్టేలేదు. కేంద్రంలో అధికారంలో లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక అంశాలు ఆ పార్టీని ఏపీలో నిస్తేజం చేశాయి. ఉమెన్ చాందీ నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ పరిస్థితి.. బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలు.. చేయాల్సిన పోరాటాల్లాంటివాటిపై ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికతోనైనా కాంగ్రెస్ పరిస్థితి మారుతుందేమో వేచిచూద్దాం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి