మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిందే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఏక్‌నాథ్‌ శిందే పేరు మన తెలుగువాళ్లకు పెద్దగా తెలియదు.. మరాఠా రాజకీయం అంటే.. ఉద్దవ్ ఠాక్రే, ఫడ్నవీస్, శరద్‌పవార్‌.. ఇలాంటి పేర్లే మనకు తెలుసు.. కానీ.. ఉన్నట్టుండి తెరపైకి వచ్చిన ఈ నాయకుడే ఏక్‌నాథ్‌ శిందే. ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే.


ఎందుకంటే.. నిన్న సీఎంగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్‌ శిందే.. ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఆటో రిక్షా నడిపితేనేగానీ పూటగడిచే పరిస్థితి ఆయన కుటుంబానిది. ఆ స్థితి నుంచి మహారాష్ట్ర సీఎం స్థాయికి ఏక్‌నాథ్‌ శిందే ఎదిగారు. సొంత పార్టీలో తిరుగుబాటు తెచ్చి.. దాన్ని విజయవంతంగా నడిపించి... ఠాక్రే సర్కారును కూల్చేసిన శిందే ఇప్పుడు తానే సీఎం పదవిని దక్కించుకున్నారు. శివసేనకు షాక్ ఇస్తూ బీజేపీ పక్షాన చేరిన శిందే.. కింగ్ మేకర్‌గా నిలుస్తారని అందరూ మొదట్లో భావించారు.


శిందే మద్దతుతో ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా శిందేనే సీఎం పదవిని దక్కించుకున్నారు. కింగ్ మేకర్ కాదు.. ఏకంగా కింగ్‌ అయ్యారు. ఇక ఈ ఏక్‌నాథ్‌ శిందే ఫ్లాష్‌ బ్లాక్‌ చూస్తే.. ఏక్‌నాథ్‌ శిందే 18 ఏళ్ల వయసులోనే శివసేనలో చేరారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఏక్‌నాథ్‌ శిందే.. మంత్రిగాను రెండు పర్యాయాలు సేవలందించారు. 1964 ఫిబ్రవరి 9న సతారాలోని జవాలి తాలుకా ప్రాంతంలో ఏక్‌నాథ్‌ శిందే పుట్టారు.


శిందే కుటుంబం ఠాణెకు వెళ్లి స్థిరపడింది. ఇంటర్‌ వరకూ చదివి ఆపేసిన ఏక్‌నాథ్‌ శిందే.. కుటుంబ పోషణ నిమిత్తం కొన్నాళ్లు ఆటో నడిపారు. ఆ తర్వాత శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంపై ప్రేమ పెంచుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో ఏక్‌నాథ్‌ శిందే శివసేనలో చేరారు. 1984లో పార్టీ కిసాన్‌నగర్ బ్రాంచ్ హెడ్‌గా ఎంపికైన ఏక్‌నాథ్‌ శిందే1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్‌ అయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీజేపీ-శివసేన ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2019లో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శిందే మరోసారి మంత్రి అయ్యారు. ఇప్పుడు పార్టీని చీల్చి ఏకంగా సీఎం అయ్యారు ఏక్‌నాథ్‌ శిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: