
దీనిపై అప్పట్లోనే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని అంతర్గతంగా చర్చించి ఆయనను హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపించింది. గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న కొలికిపూడి ఇప్పుడు మళ్ళీ వివాదానికి దారి తీసేలాగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా ఓ ఆన్లైన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొలికపూడి రాజధాని అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా టిడిపిని ఇరుకున పడేసేలా వ్యవహరించడం వంటివి ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం రాజధా ని అమరావతిని విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాలను సేకరించారు. అదేవిధంగా మరో 44 వేల ఎకరాలను అదనంగా సేకరించి అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇతర పారిశ్రామిక పెట్టుబడిదారులకు అనుకూలంగా కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే 44 వేల ఎకరాలు అదనంగా సేకరించే విషయంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతులు కూడా ఇప్పటికే ఇచ్చిన భూములకు సంబంధించి న్యాయం చేయలేదని అంటున్నారు.
కొత్తగా మా నుంచి భూములు తీసుకోవడం ఎందుకని కొన్నిచోట్ల ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులను ఏదో ఒక విధంగా బుజ్జగించి. వారిని ఒప్పించి భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగా మరోవైపు కొలికపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల పక్షాన తాను ముందుండి పోరాడతానని, అదనంగా భూ సమీకరణ ఎందుకని ఆయన కొత్త వాదన తెచ్చారు. వాస్తవానికి గతంలో అమరావతి రాజధాని జేఏసీ నాయకుడిగా ఉన్న కొలికపూడి రాజధాని రైతుల తరఫున వైసీపీ ప్రభుత్వంలో పోరాటాలు చేశారు.
తీవ్ర స్థాయిలో వైసిపి ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. ఇదే ఆయనకు రాజకీయంగా తిరువూరు టికెట్ లభించేలా చేసింది. అయితే, ఇప్పుడు తాను రాజకీయ నాయకుడినని, పైగా అధికారంలో ఉన్నానన్న విషయాన్ని కూడా మరిచిపోయి రైతులను ఏదో ఒక రకంగా ఒప్పించి లేదా రాజధాని పట్ల అనుకూలంగా వ్యవహరించేలాగా చేయాల్సిన బాధ్యత ఉన్న నాయకుడిగా వ్యవహరించాల్సింది పోయి. రైతుల పక్షాన పోరాటాలు చేస్తానని భూములు ఎందుకు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే సేకరించిన భూములకు ఇంతవరకు న్యాయం చేయలేదని ఆయన వ్యాఖ్యానించడం కూడా వివాదానికి దారితీసేలా చేస్తోంది. రేపో మాపో తనే ఉద్యమానికి దిగుతానని చెప్పడం ద్వారా మరోసారి వివాదాలకు మద్దతు ఇస్తున్నట్టు అయింది. మరోవైపు కొలిక పూడి వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న టీడీపీ.. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.