- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు ఇటీవల ఉత్తరాంధ్రపై తన దృష్టిని కేంద్రీకరించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పూర్తి ఫోకస్ పెట్టాలని, ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మూడు జిల్లాలకు ప్రత్యేక ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ, పార్టీలో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలతో ఇటీవల నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడించిన నాగబాబు.. నెలలో కనీసం వారం రోజులు ఈ జిల్లాల్లోనే గడిపేలా తన షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు.


ఇది జనసేన పార్టీ వ్యూహంలో కీలకమైన మలుపుగా మారింది. గత ఎన్నికల సమయంలోనూ నాగబాబు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావించినా, అనకాపల్లి నుంచి లోక్‌సభ టికెట్ రాకపోవడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో భాగస్వామ్యమవుతూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్ధారించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు.ఉత్తరాంధ్రలో గిరిజన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజనులకు దగ్గరవుతుండగా, నాగబాబు కూడా ఈ వ్యూహంలో భాగస్వామి కావడం అనేది కూటమికి బలాన్ని ఇచ్చే అంశం.


అయితే, నాగబాబు పూర్తి స్థాయిలో మూడు జిల్లాలపై ఆధిపత్యాన్ని చూపించేలా రాజకీయాలు చేస్తే మాత్రం, అది తేడాలకూ కారణం కావొచ్చ‌నే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన హవా పెంచే ప్రయత్నం విపరీతమైన విభేదాలను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అలాంటి పరిణామాలు కూటమి ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాగబాబు రాజకీయాలు మైల్డ్‌గా, కలుపుకుపోగలిగేలా రాజ‌కీయాలు చేయాల్సి ఉంది. లేనిపక్షంలో, ఇది విభేదాలకు దారితీసే అవకాశముంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: