కొన్ని సినిమాల్లో హీరోలకు స్నేహితుని పాత్రలో నటించిన ప్రదీప్ మాచిరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో కరెక్ట్ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్. ఇలా వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  చేసిన ప్రదీప్ త్వరలో హీరోగా మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక బుల్లితెర విషయానికొస్తే యాంకరింగ్ లో రారాజు అనే చెప్పాలి. సీనియర్ యాంకర్ సుమ తర్వాత అంతటి ఆదరణ లభించింది అంటే అది ప్రదీప్ కి అని చెప్పొచ్చు. అంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రదీప్.

అయితే ప్రదీప్ యాంకరింగ్, నటనలోనే  కాదు దయాగుణంలోనూ కూడా గొప్పవాడే అనిపించుకుంటున్నాడు. తాజాగా ఓ విద్యార్థిని చదివించడానికి కమిట్ అయ్యాడు ప్రదీప్. ఆ విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు తన బాధ్యత అంతా తనదే నంటూ సభా ముఖంగా మాట ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ప్రదీప్. ప్ర‌దీప్ వ్యాఖ్యాతగా చేసే షోల‌లో జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే స‌రిగ‌మ‌ప- నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ ఒక‌టి. ఇందులో కోఠి, ఎస్పీ శైల‌జ‌, చంద్ర‌బోస్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొత్త కంటి స్టెంట్లతో ఈ షో ద్వారా ప‌రిచ‌యం అయ్యి.. గొప్ప గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రు.  ఇతను తన గాత్రంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. షో దాదాపు ఫైనల్ కి చేరుకోగా కంటెస్టెంట్ పవన్ కి సంబంధించిన పర్సనల్ లైఫ్ వీడియో ఒకటి తాజాగా విడుదల చేశారు. అందులో ప‌వ‌న్ తండ్రి, అత‌డి మాస్ట‌ర్ స్టేజ్ మీద‌కు రాగా త‌న తండ్రి డ్రైవ‌ర్‌గా చేస్తూ ఇప్ప‌టికీ త‌న కుటుంబాన్ని న‌డుపుతున్నాడ‌ని, మాస్ట‌ర్ త‌న‌ను ఎంక‌రేజ్ చేస్తూ తన ఖ‌ర్చుల‌కు ఇస్తున్నాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా స్పందించిన ప్రదీప్... తనను పెద్ద కుమారుడిగా భావించాలని పవన్ తండ్రికి ధైర్యం చెప్పాడు.

అంతేకాదు పవన్ బీటెక్ పూర్తయ్యే వరకు కాలేజీ ఖర్చులు మొత్తం తానే భరిస్తానని మాటిచ్చాడు. స్టేజ్ పై ఉన్న వారందరూ ఎమోషనల్ అయ్యి ప్రదీప్ ను అభినందించారు. పలువురు ప్రదీప్ కు ఫోన్ చేసి మరీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుల్లితెర యాంకర్ అయినప్పటికీ.... పెద్ద హీరోలలా సాయం చేసి తన  సాయం చేసే మనసుని ,దయాగుణాన్ని చాటుకున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలో ప్రదీప్ మొట్టమొదటిసారిగా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 29న రిలీజ్‌ అవనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమా ప్రదీప్ ను హీరోగా నిలబెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: