తెలుగు ఇండస్ట్రీ లో తొలితరం నటీమణుల్లో చెప్పుకోదగిన నటి గిరిజ . ఈమె1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గా కీర్తించబడిన నటి. ఈమె మొదట కస్తూరి శివరావు నిర్మించిన "పరమానందయ్య శిష్యులు" చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది.
కాశీకి పోయాను రామాహరే... గంగలో మునిగాను రామాహరే' ఈ పాట విన్నా  ఇప్పటికీ నటి గిరిజే గుర్తుకొస్తారు.

 ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు "వెలుగునీడలు" ఎన్. టి. రామారావుతో "మంచి మనసుకు మంచిరోజులు" , జగ్గయ్య తో "అత్తా ఒకింటి కోడలే' , శివాజీగణేశ తో "మనోహర",  చలంతో "కులదైవం", తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఆ తర్వాతి రోజుల్లో 'బలిపీఠం', 'సెక్రటరీ', 'పంతులమ్మ' సినిమాల్లో వయసు మళ్లిన పాత్రలూ పోషించారు.గిరిజ సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరాలను అధిరోహించింది.

గిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి  ఎన్టీఆర్ హీరో గా కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో "పవిత్ర హృదయాలు"అనే సినిమా తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది.

గిరిజ కూతురు శ్రీరంగ దాసరి నారాయణరావు నిర్మించిన "మేఘసందేశం" మూవీ లో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: