నాటి తరం బెస్ట్ కమెడియన్స్ అనగానే బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తర్వాత బాబూమోహనే గుర్తొస్తారు. దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా రాణించారు బాబూమోహన్. ఆయన సినీ ప్రస్థానం "ఈ ప్రశ్నకు బదులేది" చిత్రంతో మొదలయ్యింది. ఆయన చిన్నతనం కడుపేదరికంలో, ఎన్నో కష్టాల మధ్య కొనసాగింది. తన చిన్న తనంలోనే తల్లి మరణించడంతో తండ్రి మానసిక పరిస్థితి దెబ్బతింది. దాంతో బాబు మోహన్ అంతా చిన్న వయసులోనే జావ కాసి ఒక గ్లాసు తన చెల్లెలుకు, మరో గ్లాసు నాన్నకు ఇంకో గ్లాసు తను తీసుకొని తాగేవారు. అదే వారి భోజనం. ఓ వైపు కడు పేదరికం. మరో వైపు తల్లి లేదు తండ్రి మానసిక స్థితి బాగోలేదు, చెల్లెలి బాధ్యత ఇలా ఎన్నో కష్టాల మధ్య తన బాల్యం అతి కష్టం మీద గడిచింది.

కొద్ది సంవత్సరాలకు బాబు మోహన్ తండ్రి మానసిక స్థితి మెరుగయ్యింది. కానీ ఆయన కొద్ది రోజులకే మరణించడంతో చెల్లెలి పూర్తి బాధ్యత బాబు మోహన్ పైనే పడింది. ఎలాగోలా కష్టపడి ఆ రోజుల్లోనే డిగ్రీ పూర్తి చేశారు బాబు మోహన్. బ్రతుకు బండి లాగేందుకు ఇంటర్ నుండే స్టేజి పై నాటకాలు వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయనకు అదృష్టం వరించింది. సత్తెనపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓ వైపు జాబ్ చేస్తూనే మరో వైపు నాటకాలు చేస్తూ ఉండేవారు. అలా ఓసారి నాటకం వేస్తుండగా ... ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవ గారు బాబు మోహన్ నటన చూసి మెచ్చుకుని ఆయన నిర్మిస్తున్న "ఈ ప్రశ్నకు బదులేది" చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుండి బాబు మోహన్ హాస్య నటుడిగా వెనుతిరిగి చూసింది లేదు.

అంతే కాక కోట శ్రీనివాసులు, బాబు మోహన్ ల కాంబినేషన్ లో కామెడీ అదిరిపోయేది. వీరి కోసం దర్శకులు పాత్ర లు అదిపనిగా సృష్టించేవారు. అంతగా వీరి కాంబో హిట్ అయింది. ఒకసారి దాసరి నారాయణ రావు ఇంటికి పిలిచి మరి నిన్నటి వరకు నీకు సినిమాలు కావాలి. నేటి నుండి నువ్వు సినిమాలకి కావాలి అని డేట్స్ ఎలా ఇవ్వాలో నేర్పించారట. అలా ఒక్కో సినిమాని ఒక్కో మెట్టుగా చేసుకుని హాస్య నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు బాబు మోహన్. నిన్న  మొన్నటి వరకు కూడా తన స్టార్ కమిడియన్ స్టేటస్ ని నిలుపుకోగా, ఇపుడు వయసు మీద పడడంతో సినిమాలకు దూరమయ్యే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: