“కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?” అనే ప్రశ్నతో దేశం మొత్తం ఊగిపోయిన రోజుల్ని ఎవరు మర్చిపోతారు! బాహుబలి – ది బిగినింగ్ 2015లో, బాహుబలి – ది కన్‌క్లూజన్ 2017లో విడుదలై చరిత్ర సృష్టించాయి. కానీ చాలా మంది ప్రేక్షకుల మనసులో ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది – ఈ రెండు భాగాలను ఒకేసారి, ఎలాంటి గ్యాప్ లేకుండా, ఒకే చిత్రంగా థియేటర్‌లో చూడాలి. ఆ కల ఇప్పటివరకు నెరవేరకపోయినా… ఇప్పుడు ఎట్టకేలకు సాకారమవుతోంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, తన అద్భుత సృజనాత్మక బృందంతో కలిసి బాహుబలి – ది ఎపిక్ పేరుతో ఒక ప్రత్యేక 4K వెర్షన్‌ను సిద్ధం చేశారు. ఇందులో బాహుబలి 1 మరియు బాహుబలి 2 ను మిళితం చేసి, ఒకే సారి చూడగలిగేలా కట్ చేశారు. అక్టోబర్ 31న ఈ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఇక ఈనెల 14న థియేటర్లలో విడుదల కానున్న కూలీ లేదా వార్ 2 సినిమాను చూడడానికి వచ్చే ప్రేక్షకులకు, బాహుబలి – ది ఎపిక్ టీజర్ మరియు ఫస్ట్ లుక్‌ను పెద్ద తెరపై చూసే అదృష్టం దక్కబోతోంది. బాహుబలి విడుదలై దాదాపు పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా, మరోసారి ఈ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని రాజమౌళి ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ప్రభాస్ (అమరేంద్ర బాహుబలి) మరియు రానా (భల్లాలదేవ) యుద్ధ సన్నివేశంలో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సూర్యవంశపు సింహాసనం కోసం సోదరుల మధ్య జరిగిన రక్తపాతం యుద్ధం, వారి రౌద్రరసం, విజువల్ గ్రాండియర్ – ఇవన్నీ పోస్టర్‌లోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి.



అయితే రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా చూపించాలంటే, కొన్ని సన్నివేశాలను తప్పనిసరిగా తొలగించాల్సి వచ్చింది. కాబట్టి ఈ కొత్త వెర్షన్ పేసింగ్ మరింత వేగంగా, యాక్షన్ మరియు ఎమోషన్ పీక్ లెవెల్లో ఉంటుందని అంచనా. అభిమానులు ముఖ్యంగా దేవసేన-అమరేంద్ర లవ్ ట్రాక్, శివుడు-భల్లాలదేవ క్లైమాక్స్ యాక్షన్ ఎలా ఎడిట్ చేశారో చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి, బాహుబలి – ది ఎపిక్ కేవలం సినిమా కాదు, ఇది పదేళ్ల క్రితం మొదలైన ఒక విజువల్ జర్నీకి గ్రాండ్ రివిజిట్. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ లాంటి నటుల మాంత్రిక ప్రదర్శనలను, కీరవాణి మ్యూజిక్‌తో మళ్లీ పెద్ద తెరపై ఆస్వాదించడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 31న, థియేటర్లలో మరోసారి “జై మహిష్మతి” నినాదం మార్మోగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: