
ఆ నోట్‌లో ఆయన రాసుకొచ్చిన విషయాలు ప్రతి ఒక్కరినీ కదిలించేవిగా ఉన్నాయి. ఆయన నోట్ లో ఇలా పేర్కొన్నారు..“లారీ డ్రైవర్‌గా పని చేసిన మా నాన్న ఎలమంచి నారాయణరావు గారి నెలవారీ సంపాదనతో మా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచిందో మాకు బాగా తెలుసు. మేము ముగ్గురినీ పెంచి, చదివించి, పెద్ద చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది ఒక్క మా అమ్మే. మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు ఆమె ఎన్నో సార్లు తన కడుపు మాడ్చుకుంది. పౌష్టికాహారం, దుస్తులు, చదువు, వైద్యం—ఏ విషయంలోనూ మాకు లోటు రానివ్వలేదు. అంతేకాకుండా, సినిమాలు చూపించి, చిన్ననాటి ఆనందాలను మాకు అందించింది. దేవాలయాలకు దర్శనానికి తీసుకువెళ్ళేది. ఇంట్లో పండుగల సమయంలో చేసే వంటలు, సీజనల్ పిండి వంటలు, నిల్వ పచ్చళ్ళు, మా అమ్మ తయారు చేసిన వంటకాలే మా పండుగల అందం. ఇంట్లో ఎలాంటి వేడుక జరిగినా, ఆ ఉత్సవానికి ప్రాణం మా అమ్మే.
అంతేకాకుండా, మా అమ్మ ఒక ఆర్థిక నిపుణురాలిలా వ్యవహరించింది. తక్కువ సొమ్ముతోనే ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం ఆమెకు ఉండేది. తెల్లవారుజామునే లేచి, పని మనిషి సహాయం లేకుండా, తన జీవితాన్ని పూర్తిగా మాకు అంకితం చేసింది. బిడ్డలకు కావలసిన ప్రతి వస్తువూ అందించాలన్న తపనతో ఆమె ఎలాంటి కష్టాన్నైనా భరించింది. తన జీవితాన్నే మాకు అంకితం చేసిన మా అమ్మ నిజమైన ఆదర్శమూర్తి. ఆమె మాకు నేర్పించిన విలువలు, ఇచ్చిన గుణగణాలు, బోధించిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. భౌతికంగా మా మధ్య లేకపోయినా, మా హృదయాల్లో మాత్రం ఆమె చిరస్మరణీయంగా ఎప్పటికీ నిలిచి ఉంటారు.” అని భావోద్వేగంతో రాశారు వైవిఎస్ చౌదరి. ఈ నోట్ చూసిన సినీ ప్రముఖులు, స్నేహితులు ఆయనను ఓదారుస్తూ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. రత్నకుమారి మృతి పట్ల వారు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..!