
మరోవైపు, విశాల్ అవార్డుల వ్యవస్థపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను జాతీయ అవార్డులతో సహా ఏ అవార్డును కూడా నమ్మనని ఆయన తెలిపారు. బెస్ట్ యాక్టర్‌ను, బెస్ట్ మూవీని జ్యూరీ సభ్యులు ఎలా డిసైడ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక సర్వే నిర్వహించి ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించి అవార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. తనకు అవార్డు రాలేదనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం లేదని, ఒకవేళ తనకు ఏదైనా అవార్డు వేసినా దానిని డస్ట్ బిన్ లో వేస్తానని విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ అవార్డు బంగారంతో చేయించింది అయితే, దానిని అమ్మేసి వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళంగా ఇస్తానని విశాల్ పేర్కొన్నారు. విశాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
'వాడు వీడు' (తెలుగులో 'నేను') సినిమా విశాల్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆయన పోషించిన 'పుల్లా ప్రసాద్' పాత్ర ఇప్పటికీ సినీ అభిమానుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది. ఈ చిత్రంలో అంగవైకల్యం ఉన్న యువకుడిగా విశాల్ నటన ఎంతో సహజంగా, హృద్యంగా అనిపించింది. ఈ పాత్రకు సిద్ధం కావడానికి పడిన కష్టం, ఆ పాత్ర తనపై చూపిన మానసిక ప్రభావం కారణంగానే మళ్లీ అలాంటి సవాల్‌ను స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని విశాల్ వెల్లడించారు. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహించారు.