జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చాలా గ‌ట్టి ఫైట్ చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నందున, ఈ సీటును గెలవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే మంత్రులు, కీలక నాయకులు అందరూ రంగంలోకి దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ఇప్పటికే బస్తీల్లో, కాలనీల్లో ప్రజలను కలుస్తూ ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా రహమత్ నగర్, బోరబండ వంటి ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూలతను బట్టి చూస్తే, కొన్ని పాయింట్లు పార్టీకి ప్ల‌స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళల్లో మంచి స్పందన తెచ్చింది. రేవంత్ రెడ్డి బలమైన నేతగా, యువతకు చేరువైన ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో వినియోగిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.


దీంతో పాటు కాంగ్రెస్‌కు కొన్ని స్పష్టమైన మైనస్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది పేదల ఇళ్ల కూల్చివేత. ఈ అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ఎత్తి చూపుతూ “హైడ్రా ప్రభుత్వం” అంటూ ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అదే విధంగా, కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్న విభేదాలు, అవినీతి ఆరోపణలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరగడం లేదన్న చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఉపఎన్నికకు కాంగ్రెస్ పోటీ పెట్ట‌డం కూడా బీఆర్ఎస్ కొన్ని వ‌ర్గాల్లోకి తీసుకు వెళుతూ సెంటిమెంట్‌ను పండిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య స్వ‌యంగా రంగంలో ఉండ‌డంతో సానుభూతి, మ‌హిళా సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతోంది.


ఇక మరొక కీలక అంశం ఏంటంటే మైనారిటీల అసంతృప్తి. మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కలేదని, ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తిని తేలికగా తీసుకుంటే, అది ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం గ‌ట్టిగా కృషి చేస్తోందని చెప్పాలి. కానీ, బీఆర్ఎస్ దూకుడు ప్రచారం, ప్రజల్లో ఉన్న కొంత అసంతృప్తి, అంతర్గత విభేదాలు అన్నీ కలిసి కాంగ్రెస్‌ను కాస్త కఠిన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఈ మైనస్‌లను అధిగమించి జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా ? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: