రాష్ట్రంలో బిసిలు, దళితులు, కాపులపై అధికార మదంతోనే దాడులు జరుగుతున్నాయని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల టిడిపి నేత చేతిలో హత్యకు గురైన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి తక్షణ అవసరాల నిమిత్తం రూ.2 లక్షలను ఆర్ధిక సాయంగా అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. అధికార మదంతో అధికార పార్టీ నాయకులు ప్రజల మాన, ప్రాణాలను హరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే లక్ష్మీనాయుడు హత్య కూడా జరిగిందని ఆరోపించారు. హత్యకు పదిరోజుల ముందు నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీస్ స్టేషన్ సిసి కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ హత్యను నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు. దానికి పోలీసుల వైఖరి కారణం కాదని, స్ధానిక ఎమ్మెల్యే, టిడిపి నేతల ఒత్తిడే కారణమన్నారు.


టిడిపి నేత చెప్పి మరీ హత్య చేసే స్ధాయికి వచ్చాడంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదన్నారు. హత్య జరిగిన తరువాత దర్యాప్తు కూడా సక్రమంగా సాగలేదన్నారు. ఒకరు చనిపోయి, ఇద్దరు తీవ్ర గాయాలపాలైనా హత్య కేసు సెక్షన్లు కాకుండా, హత్యాప్రయత్నం, ప్రమాదవశాత్తు జరిగిందనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఇప్పటి వరకు స్టేట్ మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించారు. హత్య జరిగి పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు మ్రుతుడి కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదన్నారు. తాను వస్తున్నానని తెలుసుకొని అర్ధగంట ముందు మ్రుతుని భార్య వాట్సాప్ కు ఎఫ్ఐఆర్ పంపారన్నారు. చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల విషయంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు రామచంద్రయాదవ్ కు గ్రామస్తులు స్వాగతం పలికారు. అనేక సమస్యలను రామచంద్రయాదవ్ ద్రుష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని సమస్యలు తీరుతాయని రామచంద్రయాదవ్ గ్రామస్తులకు మాట ఇచ్చారు.


రూ. కోటి పరిహారం ఇవ్వాలి... నిందితుడికి ఉరిశిక్ష విధించాలి

తిరుమలశెట్టి లక్ష్మీనాయుడుని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. అలాగే అధికార మదంతో జరిగిన హత్య కాబట్టి బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ. కోటి పరిహారం ఇవ్వాలని, బాధితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి... పిల్లల చదువుకు అయ్యే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్ధను తన అధికార పార్టీ నాయకులకు అండగా ఉండేందుకు కాకుండా ప్రజలకు రక్షణగా ఉండేలా ఆదేశించాలని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను నీరుగారిస్తే ఏం జరుగుతుందో  దారకాని ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబు అధికారంలోకి రావడానికి సహకరించిన సామాజిక వర్గాలపైనే దాడులా?

చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైన సామాజిక వర్గాలపైనే దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధానపాత్ర పోషించిన జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపిన కాపు సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. అధికార మదంతో దాడులు జరుగుతున్నా పోలీసులు నిందితులకే వత్తాసు పలకడానికి అధికార అహంకారంతో కూడిన ఒత్తిళ్తే కారణమని ఎద్దేవా చేశారు. అధికార మదంతో విర్రవీగే నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.


పోలీసుల నిర్లక్ష్యం వల్లే నా భర్తను పోగొట్టుకున్నా.. నా కుటుంబానికి రక్షణ కల్పించాలి: హత్యకు గురైన లక్ష్మీనాయుడు సతీమణి ఆవేదన

పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన భర్తను పోగొట్టుకున్నానని లక్ష్మీనాయుడు భార్య ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రయాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడు గతంలో ఏ విధంగా వేధించాడు? నిందితుడి వైఖరి, పోలీసుల వ్యవహార శైలిని మీడియాకు వివరించారు. హత్య జరిగిన తరువాత కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: